30 June, 2026 | 2:12 AM

మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

30-06-2026 12:00 AM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల, జూన్ 29 (విజయక్రాంతి): మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సాధికారత శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్‘ కార్యక్రమాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్  సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.

విద్యార్థులతో కలిసి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించి, నషా ముక్త్ భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తు అని, వారు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న ఆశలు, నమ్మకాలను నిలబెట్టేలా ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ‘ఒక్కసారి మాత్రమే తీసుకుంటే ఏమవుతుంది‘ అనే నిర్లక్ష్య ధోరణే జీవితాన్ని నాశనం చేసే స్థాయికి తీసుకెళ్తుందని, డ్రగ్స్కు అలవాటు పడిన తర్వాత దాని నుంచి బయటపడటం ఎంతో కష్టమని మంత్రి హెచ్చరించారు.

అందువల్ల ప్రతి యువకుడు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కళాశాలలు, విద్యాసంస్థలు లేదా పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగానికి సమాచారం అందించాలని మంత్రి సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే మత్తు రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.

అనుకోకుండా మత్తు పదార్థాలకు బానిసైన వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాంటి వారు సంకోచించకుండా ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి భాస్కర్, మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.