04-12-2025 04:29:04 PM
జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భాస్కర్..
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా బాల్య వివాహ ముక్త్ భారత్ - 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ భాస్కర్ తెలిపారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, షూస్ స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో రూపొందించిన వాల్ పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ, బాల్య వివాహం సమాజానికి మచ్చ వంటిదని, ఇది బాలల శారీరక, మానసిక, విద్యా భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. బాల్య వివాహాల నిషేధ చట్టం ద్వారా ప్రభుత్వం కఠినమైన శిక్షలు విధిస్తోందని, ఈ విషయాన్ని ప్రజలకు చేరువ చేసేందుకే ఈ అవగాహన బోర్డులను జిల్లాలోని ప్రతి దేవాలయం, మసీదు, చర్చి వంటి ప్రార్థనా స్థలాల వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ బోర్డుల ద్వారా బాల్య వివాహాల నిషేధ చట్టం, ఫిర్యాదు చేసే విధానం, శిక్షల వివరాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కలుగుతుందని అన్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేష్ మాట్లాడుతూ షూస్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది, జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది సమన్వయంతో బాల్య వివాహాల నిర్మూలనకు అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాల రక్ష భవన్ సిబ్బంది శ్రావణ్ కుమార్, బాల ప్రవీణ్ కుమార్, నవీన్ కుమార్, వెంకటేశ్వర్లు, షూస్ సంస్థ కో-ఆర్డినేటర్ సంతోష్ కుమార్, అలాగే దేవాజి, ప్రభు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.