calender_icon.png 4 December, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాది తిరిగేలోపు విమానాశ్రయం పనులు ప్రారంభం..!

04-12-2025 05:06:36 PM

హైదరాబాద్: ఆదిలాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రూ.18.7 కోట్ల విలువైన అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన - విజయోత్సవ బహిరంగ సభలో మాట్లాడుతూ... రెండేళ్ల క్రితం ఓటును ఆయుధంగా మార్చి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపారని పేర్కొన్నారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటోందని, సంక్షేమం-అభివృద్ది రెండుకళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు. రెండేళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానని.. చిన్న వయసులోనే నాకు గొప్ప అవకాశం దక్కడం.. ప్రజల దీవెన, దేవుడి సంకల్పం అని తెలిపారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి రాజకీయలకు అతీతంగా కృషి చేస్తున్నామని, గత ప్రభుత్వం పదేళ్లపాటు విపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అనుమతించలేదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్దికి తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంటరీ రూపొందించామని.. పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఈనెల 8, 9న గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్ లో విమానాశ్రయం పనులు ప్రారంభమవుతాయని, ఏ ఆశయంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారో.. గత పదేళ్లలో అది నెరవేరలేదని అన్నారు. ఇంద్రవెల్లి స్పూర్తిగానే గత ప్రభుత్వంపై తాను పోరాటం ప్రారంభించానని, అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరుల స్థూపం పర్యాటకంగా అభివృద్ది చేసే దస్త్రంపై సంతకం పెట్టానని సీఎం పేర్కొన్నారు. ఆదిలాబాద్ కు సాగునీరు అందేలా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును వైఎస్ఆర్ చేపట్టారని, మాజీ సీఎం కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును  పక్కకు పెట్టారని పేర్కొన్నారు.

ప్రాణహిత-చేవెళ్లను పక్కకు పడేసి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిందని అన్నారు. ప్రజల సొమ్ము దోచుకుని అక్రమ సోమ్ము కోసం ఇవాళ కుటుంబంలో గొడవలు పడుతున్నారని, ప్రజల సొమ్ము దోచుకున్న ఆ కుటుంబంలో పైసల కోసం కొట్లట జరుగుతుందని పేర్కొన్నారు. అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ తుమ్మిడిహెట్టి వద్దే నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు నీరందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన సిమెంట్ పరిశ్రమను పునరుద్దరించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేసేందుకు ఈ ప్రభుత్వం సిద్దంగా ఉందని, జిల్లా నేతలంతా కలిసి వర్సిటీకి స్థలాన్ని ఎంపిక చేస్తే వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఇప్పటికే 61 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఎన్నికల ఉత్సవం పూర్తి కాగానే మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ చేపడతామని అన్నారు.