ఉపసర్పంచుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
నారాయణరావుపేట మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బింగి నవీన్
సిద్దిపేట రూరల్, జూన్ 15: ఉప సర్పంచుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంతో పాటు గ్రామ పంచాయతీల బలోపేతం, గ్రామాభివృద్ధే లక్ష్యంగా నారాయణరావుపేట మండల ఉప సర్పంచుల ఫోరం కృషి చేస్తుందని ఫోరం సభ్యులు తెలిపారు.
సోమవారం ఫోరం అధ్యక్షుడిగా నారాయణరావుపేట ఉప సర్పంచ్ బింగి నవీన్, ఉపాధ్యక్షుడిగా దొందడి పరశురాములు, ప్రధాన కార్యదర్శిగా కోడి రాజు, సహాయ కార్యదర్శులుగా నర్సింహారెడ్డి, గుండెల్లి రాజు, సలహాదారులుగా సాదుల లావణ్యరాజు, బోకూరి రాజిరెడ్డి, దరిపల్లి కనకయ్య, పిట్ల నరేష్, ఆకుల వినయ్, బెజుగం కృష్ణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడు బింగి నవీన్ మాట్లాడుతూ ఉప సర్పంచుల హక్కులు, బాధ్యతల పరిరక్షణకు ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలిపారు. మండలంలోని ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు గ్రామ పంచాయతీల అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతానికి ఫోరం కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






