గోండు రాజుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
చారిత్రాత్మక కోటకు భంగం కలగకుండా పనులు చేపట్టాలన్న జిల్లా కలెక్టర్
ఉట్నూర్, జూలై 3 , (విజయక్రాంతి) : పర్యాటకులను ఆకర్షించేలా గోండు రాజుల కోట పునరుద్ధరణ పనులు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని చారిత్రక గోండు రాజుల కోటను ఐటీడీఏ పీవో మంద మకరందు తో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కోటతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు.
అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గోండు రాజుల చరిత్రకు, గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ కోటను త్వరితగతిన పునర్నిర్మించాలని ఆదేశించారు. ఆధునిక సౌకర్యాలతో దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా దీనిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. కోట పునర్నిర్మాణ పనుల్లో ఎక్కడ చారిత్రకు భంగం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.
భావితరాలకు గిరిజనుల గొప్ప చరిత్రను తెలియజేసే విధంగా కోటలో ఒక అత్యాధునిక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మ్యూజియంలో గోండు రాజుల వంశ చరిత్ర, వారి పాలన, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ ఆనవాళ్లు, పురాతన వస్తువులు, చారిత్రక ఆధారాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
అదేవిధంగా కోట ప్రాంగణంలో గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదిక, గిరిజన హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తుల విక్రయానికి మార్కెటింగ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటితో పాటు చిన్నారుల కోసం ప్రత్యేక పార్కు, క్రీడా ప్రాంగణం, సందర్శకుల కోసం రూఫింగ్ షెడ్లు, విశ్రాంతి భవనాలు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, ఆకర్షణీయమైన ఉద్యానవనాలు, విద్యుద్దీపాల అలంకరణ, పచ్చదనం పెంపు వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని పేర్కొ న్నారు.
సందర్శకులు కోట చరిత్రను సులభంగా తెలుసుకునే విధంగా సమాచార ఫలకాలు, దిశానిర్దేశక బోర్డులు, డిజిటల్ సమాచార వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్కియాలజీ డైరెక్టర్ అర్జున్ రావు, అదనపు డైరెక్టర్ నరసింహులు, డిడి సాగర్, ఓఎస్డి రాజు, పర్యాటక శాఖ అధికారి రవికుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ తానాజీ, ఏపీఓ పిబిటిజి ఆత్రం భాస్కర్, డిప్యూటీ డిఇఓ చందన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






