calender_icon.png 9 January, 2026 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వానికి సోయి లేదు.. సభకు రాను

07-01-2026 01:17:31 AM

బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): జీరో అవర్‌లో ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల గురించి ఈ సర్కార్‌కు సోయి లేదు. ఒకటో తేదీన జీతాలు వేస్తున్నామని చెప్పుకోవడం తప్ప, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర బిల్లుల ఊసే ఎత్తడం లేదు అని ధ్వజమెత్తారు.

రాష్ట్ర ఖజానాలో నిధులున్నా, సుమారు రూ. 14 వేల కోట్ల ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని కాటిపల్లిఆరోపించారు. నెలకు రూ. 700 కోట్లు విడుదల చేస్తామన్న ఆర్థిక మంత్రి హామీ ఆరు నెలలైనా నెరవేరలేదన్నారు.గత ఏడాది మార్చి నుంచి 20,500 మంది రిటైర్ అయితే, వారికి నయా పైసా బెనిఫిట్ అందలేదని, కొందరు మనోవేదనతో చనిపోతున్నారని, కనీసం అంత్యక్రియల డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం, మంత్రులకు రక్షణగా ఉండే పోలీసులకు టీఏ, డీఏలు లేవని, కార్యాలయాల్లో 18 నెలలుగా మెయింటెనెన్స్ బిల్లులు రాక అధికారులు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.మార్చి 1లోపు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి. లేదంటే మార్చి 2 నుంచి నిరాహార దీక్ష చేపడతా. ప్రభుత్వం దిగిరాకపోతే ఆమరణ దీక్షకు వెనుకాడను. అప్పటి వరకు అసెంబ్లీకి కూడా రాను, అని కాటిపల్లి శపథం చేశారు. పెన్ డౌన్ చేసే పరిస్థితి వస్తే పాలన స్తంభించిపోతుందని హెచ్చరించారు.