30 June, 2026 | 1:43 AM

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం

30-06-2026 12:00 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

అశ్వాపురం, జూన్ 29 (విజయక్రాంతి): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన గృహాలను అందిస్తున్నామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

సోమవారం అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని బడుగు బజార్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులు గాదె మాధవి, సిలివేరు అనసూర్య కుటుంబ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలు శాశ్వత నివాస సౌకర్యాన్ని పొందుతున్నాయని, ప్రతి అర్హత గల కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కొత్త ఇంటిలో అడుగుపెట్టిన కుటుంబాలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్వో సూర్యప్రకాష్, ఎంపీడీవో ముత్యాలరావు, హౌసింగ్ ఏఈలు ఉదయ్ కుమార్, భరత్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి యాకుబ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.