calender_icon.png 3 December, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యతతోనే హక్కుల సాధన

03-12-2025 08:49:14 PM

-పెరిక కుల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి

-జిల్లాకు ఒక ఆత్మగౌరవ భవనం కట్టిస్తాం

-పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యర్రంశెట్టి ముత్తయ్య

-ములుగు జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా పల్నాటి నాగేశ్వరరావు, సాయిని శ్రీనివాస్

ఏటూరునాగారం (విజయక్రాంతి): సకల సామాజిక రంగాల్లో పెరిక కుల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యర్రంశెట్టి ముత్తయ్య విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బుధవారం జరిగిన పెరిక కుల ములుగు జిల్లా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పెరిక కుల ఐక్యతతోనే హక్కులు సాధించవచ్చని, ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో ప్రతి జిల్లా కేంద్రంలో పెరిక కుల ఆత్మగౌరవ భవనాలను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర సంఘం పనిచేస్తుందని అన్నారు.

వ్యవసాయ రంగం పునాదిగా జీవనం కొనసాగిస్తున్న పెరిక కులస్తులు ఇటీవలి కాలంలో రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో రాణిస్తున్నారని, పెరిక కులస్తులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకుసాగుతామని అన్నారు. ఈ సదస్సులో పాల్గొన రాష్ట్ర అధికార ప్రతినిధి సాయిని నరేందర్ మాట్లాడుతూ రానున్న కాలమంతా బీసీ శఖమని, పెరిక కులస్తులు సామాజిక చైతన్యంతో రాజకీయ వాటా సాధించాలని, సకల అభివృద్ధికి రాజకీయాలు పునాదని అలాంటి రాజకీయాల్లో, సామాజిక ఉద్యమాల్లో పెరిక కులస్థుల అభివృద్ధికి పాటుపడుతామని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏండ్లు కావస్తున్నప్పటికీ బీసీలు మౌళిక రంగాల్లో వెనకబడ్డారని, రాజకీయాల్లో వాటా దక్కడం లేదని, చట్ట సభల్లో సమాన వాటా లేదని అన్నారు.

జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల కోసం జరిగే పోరులో పెరిక కులస్తులు ముందుండాలని పిలుపునిచ్చారు. పెరిక కుల ములుగు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా పల్నాటి నాగేశ్వరరావు, సాయిని శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోబడిన పల్నాటి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ములుగు జిల్లాలోని పెరిక కులస్థుల ఐక్యతకు, అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో పెరిక కుల ఆత్మగౌరవ భవనం నిర్మించి పెరిక విద్యార్థులకు చేదోడుగా నిలుస్తానని అన్నారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో బి.సి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. త్వరలోనే ములుగు జిల్లా పూర్తి కమిటీని నియమించి భారీ బహిరంగ సభ పెడతానని అన్నాడు.