calender_icon.png 17 July, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

17-07-2025 01:19:32 AM

  1. జిల్లాకు 13,000 కొత్త రేషన్ కార్డులు మంజూరు
  2. మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహా
  3. సంగారెడ్డిలో మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రులు
  4. వడ్డీ రాయితీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు

సంగారెడ్డి, జూలై 16(విజయక్రాంతి):: స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం, మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహలు అన్నారు.

బుధవారం సంగా రెడ్డిలో  నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి వారు టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావిణ్యలతో కలిసి ముఖ్య అతిథులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు. అలాగే పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సంగారెడ్డి జిల్లాకు 13వేల పైచిలుకు రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మహిళలతో పాఠశాల గదుల నిర్మాణం, కళాశాల గదుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు సైతం మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చేయూత పథకం ద్వారా గత 25 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. 23 వేలకు పైగా ఉన్న స్వయం సహాయక సంఘాలకు రూ.30 కోట్ల వడ్డీ లేని రుణాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

జిల్లాలో మహిళా సంఘాల ద్వారా ఒక పెద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వం జిల్లా, మండల సమైక్యలకు సహకరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రుల చేతులమీదుగా సంగారెడ్డి నియోజకవర్గంలోని  స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను, మహిళా సంఘ సభ్యులకు రుణ భీమా, ప్రమాద భీమా  చెక్కు లను, మహిళా సంఘాలకు బ్యాక్ లింకెజీ రుణాలను,  అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీవో పీడీ జ్యోతి పాల్గొన్నారు.