calender_icon.png 12 September, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుణాత్మక విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

12-09-2025 12:00:00 AM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 11 (విజయక్రాం తి): ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం  కాగజ్ నగర్ మండలం అనుకోడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, గన్నా రం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి బోధన పద్ధతులను, మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ తరగతిగది కార్యకలాపాలు, ఫౌండేషనల్ లెటర్స్ అండ్ న్యూమర సి (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. తరగతి గదులలో బోధనా పద్ధతులను పరిశీలించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధించాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో పాటు శుద్ధమైన త్రాగునీటిని అందించి వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలలో పారిశుద్ధ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, వ్యక్తిగత పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - ఆరెగూడ బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.