12-09-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): జిల్లాలో పంట నష్టం సర్వే, యూరియా పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు.
కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఏర్పడిన పంట నష్టం, యూరి యా పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసినందున దాదాపు 15 వేల ఎకరాల వరకు పంట దెబ్బతిన్నందున పంట నష్టం సర్వే నిర్వహించి వెంటనే నివేదికలు అందించాలని తెలిపారు. త్వరలో జిల్లాకు వచ్చే యూరియా పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని, చిన్న రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా కార్యచరణ రూపొందించి, వ్యవసా య, సహకార శాఖల అధికారులు పంపిణీ కేంద్రాల వద్ద ఉండి పరిస్థితిని సమీక్షించాలని తెలిపారు. జిల్లాలోని ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వెంకటి, మనోహర్, మిలింద్ కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వైద్యుల నియామకం
జిల్లాలోని ప్రజలకు మెరు గైన వైద్య సేవలు అందించేందుకు వైద్యుల నియామకం ప్రక్రియ చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లాలో గల ఏరియా ఆసుపత్రి, సామాజిక ఆసుపత్రులలో పని చేసేందుకు 23 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్), ఎంబీబీఎస్ పోస్టుల భర్తీ కొరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అభ్యర్థులకు ఇంట ర్వ్యూ నిర్వహించడం జరిగిందన్నారు. ఇంటర్వ్యూకు 15 మంది హాజరయ్యారని, వీరిలో 2 స్పెషలిస్ట్ డాక్టర్లు, 11 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంపిక అయ్యారని తెలిపారు.