ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి
ట్యాబ్ ఎంట్రీలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి
మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే అన్‌లోడింగ్ చేయాలి
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, జూన్ 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మానిటరింగ్ అధికారులు, ఏపీఎంలు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్న ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా ఎప్పటికప్పుడు లిఫ్టింగ్ చేపట్టాలని తెలిపారు. కొనుగోలు వివరాలను ట్యాబ్లలో వెంటనే నమోదు చేయాలని, పెండింగ్ ఎంట్రీలు లేకుండా చూడాలని ఆదేశించారు.
ట్యాబ్ ఎంట్రీలలో జాప్యం వల్ల రైతులకు చెల్లింపులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి తరలించిన ధాన్యాన్ని వెంటనే అన్లోడింగ్ చేసి నిల్వ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్లోడింగ్లో జాప్యం జరిగితే లిఫ్టింగ్ ప్రక్రియ దెబ్బతింటుందని, తద్వారా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి ధాన్యం కొనుగోలు, లిఫ్టింగ్, అన్లోడింగ్, ట్యాబ్ ఎంట్రీల ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బంది, సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా ఈ ప్రక్రియను వేగవంత చేయాలని ఆదేశించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, మానిటరింగ్ అధికారులు, ఏపీఎంలు పాల్గొన్నారు.






