calender_icon.png 11 November, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

11-11-2025 07:07:29 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండలం మోదెల, ఇటిక్యాల, గంపలపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 150, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 97, డి.సి.ఎం.ఎస్. ఆధ్వర్యంలో 63, మెప్మా ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు 2,389/- సాధారణ రకానికి క్వింటాలుకు 2,369/- గా నిర్ణయించడం సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యాలను వేరువేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.

రైతుల సౌకర్యం కోసం త్రాగునీరు, నీడ వసతి కల్పించడంతో పాటు గోనె సంచులు, తేమ యంత్రాలు, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్ కవర్లు ఇతర సౌకర్యాలు సమకూర్చడంతో పాటు ధాన్యం విక్రయించిన రైతులకు త్వరగా చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.  జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.