11-11-2025 07:09:49 PM
పటాన్ చెరు: ప్రఖ్యాత భారతీయ గాయని, స్వరకర్త, రచయిత్రి విద్యా షా సూఫీ సంగీతం ‘రంగ్ సుఫియానా’ మంగళవారం హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ)లో ప్రేక్షకులను మంత్రుముగ్ధులను చేసింది. ‘సంస్కృతి’ పేరిట కేఎస్ పీపీ నిర్వహిస్తున్న తొలి సాంస్కృతిక కార్యక్రమం ఇది. దక్షిణ భారత కుటుంబంలో జన్మించి, కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన విద్యా షా విభిన్న సంగీత సంప్రదాయాలను సమాన అభిరుచితో సాధన చేశారు. తుమ్రీ, దాద్రా లేదా సూఫీ అయినా దాని స్ఫూర్తిలో పూర్తిగా మునిగిపోయినప్పుడే నిజమైన సంగీతం ప్రారంభమవుతుందని ఆమె విశ్వసిస్తారు.
‘సంగీతం హృదయాలను తాకుతుంది. ఆ భావోద్వేగ సంబంధం అన్నిరకాల సంగీతానికి సారాంశం’ అని ఆమె తన ప్రదర్శన సమయంలో నిరూపించడమే గాక, తన హృదయపూర్వక ప్రదర్శనలు, సంభాషణల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సారంగిపై కమల్ అహ్మద్, తబలాపై సర్దార్ ఖాన్, కీబోర్డుపై ఉమర్ ఖాన్, ప్యాడ్ లో మానస్ దాస్ గుప్తా తదితరులు విద్యా షాకు సహకారం అందించారు. కళాకారిణి గురించి న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ గాయని స్వరకర్త విద్యా షా, ఉత్తర భారత శాస్త్రీయ సంప్రదాయాలలో విద్వాంసులు శుభ ముద్గల్, ముజాహిద్ హుస్సేన్ ఖాన్, శాంతి హిరానంద్ ల వద్ద శిక్షణ పొందే ముందు కర్ణాటక సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు.
ఆమె తాన్సేన్ సమరోహ్ (గ్వాలియర్), ది కెన్నెడీ సెంటర్ (వాషింగ్టన్ డీసీ), ది ఆసియా సొసైటీ (న్యూయార్క్), ది బోడే మ్యూజియం (బెర్లిన్) వంటి ప్రతిష్టాత్మక వేదికలలో ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె చేపట్టిన ప్రాజెక్టు- ‘ఉమెన్ ఆన్ రికార్డ్’కు చార్లెస్ వాలెస్ అవార్డుతో పాటు, భారత ప్రభుత్వం నుంచి సీనియర్ ఫెలోషిప్ గ్రహీత అయిన విద్యా షా రచన గ్రామోఫోన్ యుగం నుంచి తొలి మహిళా ప్రదర్శనకారుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. భక్తి కవయిత్రులపై ఆమె చేసిన పరిశోధన ఠాగూర్ స్కాలర్ షిప్ (2023)ను కూడా అందుకుంది.‘జల్సా: ఇండియన్ ఉమెన్స్ జర్నీ ఫ్రమ్ ది సలోన్ టు ది స్టూడియో’ (తులిక బుక్స్) రచయిత్రి విద్యా షా. గోవా విశ్వవిద్యాలయంలో (2016-20) భారతీయ సంగీతం కోసం నానా షిర్గావ్కర్ చైర్ ప్రొఫెసర్ గా ఆమె పనిచేశారు. ‘మాంటో’ చిత్రంలో ‘బోల్ కే లబ్ ఆజాద్ హై తేరే’ పాటతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం, ఆమె భారతదేశ అస్పృశ్య సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడి, ప్రోత్సహించడానికి అంకితమైన భూమా ట్రస్టుకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.