28 March, 2026 | 2:34 AM

కల్యాణం.. కమనీయం..

28-03-2026 12:00 AM

కనుల పండువగా ఇల్లందకుంటలో శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే దంపతులు

ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం

హుజురాబాద్, మార్చి 27 (విజయక్రాంతి) : ఆశేష భక్తజనం.. వేదమంత్రాలు తాళాలు తప్పట్ల మధ్య సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.  కరీంనగర్ జిల్లా నుంచియే కాక వరంగల్ హనుమకొండతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని  ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం కనుల పండువగా సాగింది.

భద్రాచలం తర్వాత రెండవ అతిపెద్ద కళ్యాణ మహోత్సవం ఇల్లందకుంటలో జరుగుతుండడంతో జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణానికి తరలివచ్చారు. రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు పూలమాలలు సమర్పించారు  జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం  స్వామివారికి ముత్యాల తలంబ్రాలు,పూలమాలలు  సమర్పించారు. వారంతా స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు అంగరంగ వైభవంగా స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ప్రతి ఏట నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. ప్రతిఘట్టం భక్తులను ఆకట్టుకుంది. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తదితరులు స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు. వేలాదిమంది భక్తులు దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. కళ్యాణం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వి విఐపి లు ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భక్తుల సౌకర్యార్థం షామియానాలు, చలువ పందిళ్ళు భారీకేడ్లు, కార్పెట్లు ఏర్పాటు చేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, తాగునీటి వసతి కల్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వివిధ మార్గాల ద్వారా కళ్యాణానికి హాజరయ్యే భక్తుల కోసం పలు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు, ఏసిపి మాధవి, దేవస్థానం చైర్మన్ రాము,  దేవస్థానం ఈవో సుధాకర్, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పలువురు సిఐలు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

ఆదర్శం శ్రీరాముని జీవితం..

శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి : శ్రీరాముని జీవితం ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా  మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామాల్లో నిర్వహించిన శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిం చిన కళ్యాణ వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ధర్మపురి మండలం తీగల ధర్మారం శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణం వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ధర్మపురి పట్టణంలోని శ్రీలక్ష్మీ నరసింహా కాలనీ నిర్వహించిన సీతారామ కళ్యాణంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.