14 July, 2026 | 4:52 AM

ఈ నెల 21న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ పెరగనున్న కూల్ డ్రింక్స్, సిగరెట్ల ధరలు

04-12-2024 01:09 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: శీతల పానీయాలు, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ పెరిగే అవకాశం ఉంది. ఈ ఉత్పత్తులపై ప్రభుత్వం ప్రస్తుతం 28శాతం జీఎస్టీ విధిస్తోంది. అయితే వీటిపై జీఎస్టీని 35 శాతానికి పెంచాలని రేట్ల హేతుబద్ధీకరణ కోసం బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జీవోఎం) జీఎస్టీ కౌన్సిల్ ఎదుట ప్రతిపా దించనుంది.

జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై తాజాగా సమావేశమైన జీవోఎం ఇప్పటి వరకూ కొనసాగుతున్న పన్ను శ్లాబులకు తోడు 35 శాతంతో కొత్త పన్ను శ్లాబును తీసుకురావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులు ఉన్నాయి. మొత్తం 148 వస్తువులపై పన్ను రేట్లలో మార్పులు చేయాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది.

అయితే జీవోఎం నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన ఆయా ఉత్పత్తులపై జీఎస్టీ పెరగదు. జీవోఎం నిర్ణయాలపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటంది. ఈ క్రమంలోనే జీవోఎం సూచనలపై చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 21న సమావేశం కానుంది. ఈ సమావేశంలో జీవోఎం ప్రతిపాదనలకు కౌన్సిల్ ఓకే చెబితే శీతల పానీయాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెరుగుతుంది. ఇదే జరిగితే ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగి సామాన్యుల జేబుకు చిల్లు పడుతుంది. 

జీవోఎం పెంపు ప్రతిపాదనలు

1. శీతల పానీయాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విధిస్తున్న జీఎస్టీని 28శాతం నుంచి 35శాతానికి పెంచాలి.

2. రూ.1500 వరకు ఉన్న దుస్తులపై 5 శాతం, రూ.1500 మధ్య ధర ఉన్న దుస్తులపై 18 శాతం, రూ.10వేల కంటే ఎక్కువ ధర ఉన్న వస్త్రాలపై పన్నును 28శాతం జీఎస్టీ విధించాలి.

3. రూ.15వేల కంటే ఖరీదైన బూట్లపై విధించే జీఎస్టీని 18శాతం నుంచి 28 శాతానికి పెంచాలి.

4. చేతి గడియారాల ఖరీదు రూ.25వేల కంటే ఎక్కువ ఉంటే వాటిపై విధించే జీఎస్టీ 18 శాతం నుంచి 28శాతానికి పెంచాలి 

జీవోఎం తగ్గింపు ప్రతిపాదనలు

1. 20లీటర్ల ప్యాకేజ్డ్ డ్రికింగ్ వాటర్‌పై విధిస్తున్న జీఎస్టీని 18శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలి.

2. నోట్ పుస్తకాలపై 12శాతం విధిస్తున్న జీఎస్టీని 5శాతానికి తగ్గించాలి.