03-07-2025 01:47:52 AM
ఉద్యమగొంతుకు న్యాయం , నేర్నాల కిశోర్కు సముచిత స్థానం
హుస్నాబాద్, జులై 2 : దశాబ్ద కాలానికి పైగా తెలంగాణ ఉద్యమం కోసం, నిరుద్యోగ కళాకారుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకవి, గాయకుడు నేర్నాల కిశోర్కు సముచిత స్థానం లభించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర టూరిజం, భాషా, సాంస్కృతిక శాఖ సలహాదారుగా ఆయనను నియమించడంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంత తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్యమ గొంతుకకు దక్కిన న్యాయమని వారు అభిప్రాయపడుతున్నారు.
* నేర్నాల ఉద్యమ ప్రస్థానం..
తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాంస్కృతిక విభాగం తొలి కన్వీనర్గా నేర్నాల కిశోర్ కీలక పాత్ర పోషించారు. ఆయన కలం నుంచి జాలువారిన అనేక పాటలు, ముఖ్యంగా ‘బార్డర్లో సైనికుడా.. భారత్ కు రక్షకుడా.. మాకోసం ప్రాణాలిస్తివా.. ఓ సైనికుడా.. కార్గిల్ ల్లో కన్నుమూస్తివా ఓ సైనికుడా...‘ వంటి దేశభక్తి గీతాలు, ‘ఎట్లున్నవే నాపల్లె ఎట్లున్నవే నా తల్లీ‘ వంటి హృదయాలను హత్తుకునే పాటలు, ఇంకా అనేక సామాజిక గీతాలు, తెలంగాణ ఉద్యమ గీతాలు ఉమ్మడి రాష్ట్రంలో హుస్నాబాద్, హుజూరాబాద్ ప్రాంతాలకు విశేష ఖ్యాతిని తెచ్చాయి. తన సాహిత్యంతో, గానంతో ప్రజలను చైతన్యపరిచారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కేవలం పాటలకే పరిమితం కాలేదు. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని, జైలు జీవితాన్ని కూడా గడిపారు. ‘పల్లెనుంచి ఢిల్లీ దాకా‘ ధూమ్ ధాం కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసుకున్నారు. గత ప్రభుత్వంలో సాంస్కృతిక సారథి రూపకర్తగా వ్యవహరించారు. అయితే, సారథిలో ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, తాను పొందిన సారథి కోఆర్డినేటర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని, తన అపాయింట్మెంట్ లెటర్ను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా సాక్షిగా చింపేసి, తన భార్యతో కలిసి గత ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఇది ఆయన నిబద్ధతకు, త్యాగానికి నిదర్శనం.
* కళాకారుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం
ఆ తర్వాత కూడా నేర్నాల కిశోర్ నిరుద్యోగ కళాకారుల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా తన పోరాటాన్ని కొనసాగించారు. ’దుఃఖాల ధూం ధాం’ ప్రోగ్రాం పేరుతో బస్సు యాత్ర చేపట్టి, తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గత పదేండ్లుగా నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒప్పించి తమ డిమాండ్లను మేనిఫెస్టోలో పొందుపరిచేలా కృషి చేశారు. ప్రస్తుతం, రాష్ట్రంలో ’సారథి కోటాను పెంచి నిరుద్యోగ ఉద్యమ కళాకారులకు ఉద్యోగ నియామకాలు చేపట్టి ఆదుకోవాలని’, ’ప్రతి ఉమ్మడి జిల్లాలో పాటల పల్లకి’ కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ, కళాకారులను ఏకం చేస్తూ వారి బతుకుల్లో వెలుగు నింపేందుకు ‘మా పల్లె పాటల ముల్లె‘, ‘మా పల్లె ఎలమంద‘ వంటి కార్యక్రమాలతో నిరంతరం కృషి చేస్తున్నారు.
* సముచిత స్థానం పట్ల హర్షం
ఇలాంటి నిబద్ధత కలిగిన, త్యాగశీలి అయిన నేర్నాల కిశోర్ను తెలంగాణ ప్రభుత్వం టూరిజం, భాషా, సాంస్కృతిక శాఖ సలహాదారుడిగా నియమించడం గొప్ప విషయమని హుస్నాబాద్ ప్రాంత కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్యమకారుల త్యాగాలకు దక్కిన గౌరవమని, భవిష్యత్తు లో నిరుద్యోగ కళాకారుల సమస్యలు పరిష్కారమవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.