calender_icon.png 7 July, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సమ్మేళనం

03-07-2025 01:49:49 AM

కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న ఖర్గే

వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, జులై 2 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా, ఈనెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల సమ్మేళనాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సమ్మేళనానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. బుధవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు.

వీరితో పాటు రాష్ట్ర మంత్రి మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు భాగస్వామ్యం కానున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు తదితర అంశాలపై మల్లికార్జున ఖర్గే పార్టీ శ్రేణులకు విలువైన సూచనలు ఇచ్చి, దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి గ్రామ శాఖ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, జిల్లా కమిటీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 500 మంది గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు సభకు హాజరయ్యేలా కృషి చేసి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, గ్రామ స్థాయి నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జరుగుతున్న ఈ సమావేశం కీలకమైనదిగా భావిస్తున్నారు.