26-11-2024 12:00:00 AM
అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకెళుతున్న భారత్ ఆర్థికంగా బలీయమైన శక్తిగా ఎదుగుతు న్నది. యువత శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే భవిష్య త్తులో భారతదేశం ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మన దేశం ప్రపంచానికే మార్గ నిర్దేశనం చేసే స్థితిలో ఉంది. సర్వకాల సర్వావస్థలలోనూ మానవాళికి భారతీయతే ఆచరణీయం. భారతదేశం అగ్రదేశం కాకపోవచ్చు కానీ, అన్ని రంగాల్లో అగ్రపథంలో కొనసాగుతుండడం విశేషం.
భారతీయ జీవనశైలి విభిన్నమేకాక విలక్షణమైంది కూడా. ఒకప్పుడు అత్యం త హేళనకు గురైన భారతీయ జీవన విధానం, తాత్తికత నేడు ప్రపంచానికే ఆచరణీయంగా, ఆదర్శప్రాయంగా మా రాయి. విలువలు, సుగుణాల రీత్యాకూడా ప్రపంచంలో మనమే సర్వోన్నతు లం. ఒకప్పుడు ప్రపంచం ఎవరికీ అందనంత దూరంలో ఉండేది. ఒక దేశానికి, మరొక దేశానికి రవాణా మార్గాలు సరిగా లేక, ఒకరి సంస్కృతి మరొకరికి తెలిసేది కాదు.
సుదీర్ఘ నౌకాయానం క్లిష్టతరంగా ఉండేది. రాన్రాను రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. సరుకులుసహా ప్రయాణి కుల చేరవేతలో అధునాతన సౌకర్యాలు ఏర్పడ్డాయి. ప్రపంచాన్ని అవగతం చేసుకునే మార్గం సుసాధ్యమైంది. వాయు మార్గాలతోపాటు సాంకేతిక విజ్ఞానమూ పెరగడంతో అన్ని దేశాల సంస్కృతి, జీవన వ్యవహారాలు, వైవిధ్యాలు, వైరుధ్యాలు అవగతం చేసుకునే అవకాశాలు లభ్యమైనాయి. ఒక దేశంతో మరొక దేశం వ్యాపారాత్మక సంబంధాలను నెలకొల్పుకుని అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.
సంక్లిష్ట పరిస్థితుల్లో ఐక్యత
విద్య, వైద్య రంగాలు బాగా మెరుగుపడ్డాయి. విదేశాలకు వెళ్ళి వచ్చిన వారిని మన సమాజం మహా వింతగా చూసేది. చదువుకున్న వారిని ఎంతో గౌరవించి అక్కున చేర్చుకునేది. దశదిశలా విస్తరించిన సాంకేతికాభివృద్ధి ఫలితంగా నేడు ప్రపంచమే కుగ్రామమైంది. ఈ క్రమంలోనే భారతదేశం ప్రత్యేకత అందరికీ తెలిసివచ్చింది. జీవన విలువల విషయంలో అనేక దేశాలకు భారతీయతే ఆదర్శంగా మారింది. మనది స్వయంప్రకాశిత దేశం.
భిన్న కులాలు, మతాలు, భాషలు, ఆచార వ్యవహారాలతో ఒకే దారంలో ఒదగబడ్డ పూలహారం వలె సామరస్యంగా జీవించడం ప్రశంసనీయం. వైరుధ్యాలు, ఆవేశకావేషాలు తలెత్తినా అవి తాత్కాలికమే. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ ఏకమై ఐక్యతా స్వరం వినిపిస్తారు.
రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఏదైనా సమస్య ఎదురైనపుడు అంతా ఐక్యతను ప్రదర్శించడం ద్వారా అత్యధిక ప్రజలు దేశాన్ని కాపాడుకుంటున్నారు. బంగ్లాదేశ్ విమోచన, కార్గిల్ యుద్ధం, పు ల్వామా, పఠాన్‌కోట్ వంటి ఉదంతాల్లో ప్రజలంతా ఐకమత్యంగా మెలిగారు. దే శం కష్టాల్లో ఉన్నప్పుడు తామంతా భారతదేశ బిడ్డలమేనన్న స్ఫూర్తిని చాటారు. కరోనా బారిన పడ్డ ప్రపంచానికి దేశీయ జీవన విధానం అవగతమైంది. ఇక్కడి ఉత్తమ ఆచార వ్యవహారాలే ఆచరణీయమని ప్రపంచమంతా గుర్తిస్తున్నది.
చేతులు జోడించి చేసే నమస్కారంలోని సంస్కారాన్ని తెలుసుకుంటున్నారు. ‘యోగా’ను అవహేళన చేసిన వారే దాని విశిష్టతను గుర్తెరిగి పాటిస్తున్నారు. దురదృష్టం కొద్దీ మన దేశీయులు చాలా మంది విదేశీ నాగరికతల మోజులో పడుతున్నారు. మనం కోల్పోతున్న విలువల ను ముందు మనకు మనం పునరుద్ధరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ప్రపంచంలో చోటు చేసుకుంటున్న విధ్వంసకర ధోరణులకు అడ్డుకట్టు వేయాలి.
సుంకవల్లి సత్తిరాజు