26-11-2024 12:00:00 AM
నేడు సావిత్రి బాయ్ ఖణోల్కర్ వర్ధంతి
నేను పొరపాటున యూరప్ ఖండంలో జన్మించాను’ అని సగౌరవంగా ప్రకటించిన గొప్ప మహిళామణి సావిత్రి బాయ్ ఖణోల్కర్. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ముగ్ధురాలైన స్విస్ మహిళ మన ‘పరమ వీర్ చక్ర’ అత్యున్నత సైనిక పురస్కారాన్ని రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించారు. ‘ఈవ్ వయెన్నా మేడే డి మారోస్’ పేరుగల ఆమె భారత్‌కు వచ్చాక ‘సావిత్రి బాయ్ ఖణోల్కర్’గా మారారు. స్విట్జర్లాండ్‌లో 1913 జూలై 20న ఆమె జన్మించారు.
చదువుకునే రోజుల్లోనే ఆ దేశ పర్యటనకు వచ్చిన మరాఠా ప్రాంత ఇండియన్ ఆర్మీ కెప్టెన్ ‘విక్రమ్ రామ్‌జీ ఖణోల్కర్’తో ప్రేమలో పడ్డారు. భారతదేశం వచ్చి 1932లో ఆయన్ను పెండ్లి చేసుకున్నారు. మన దేశ చరిత్ర, పౌరాణిక గాథలు, సంస్కృతి సాంప్రదాయాలపట్ల అవగాహన పెంచుకున్నారు.
ప్రాణాలను సైతం లెక్కచేయక విజయమే లక్ష్యంగా విధి నిర్వహణ చేసే మన సైనికుల ప్రతిభా పాటవాలను గుర్తిస్తూ పలు ‘గ్యాలంటరీ అవార్డుల’ను ప్రభుత్వం ప్రదానం బహుకరిస్తున్న సంగతి తెలిసిందే. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకూ, భారత సైనికులకు బహుకరించే అత్యున్నత బ్రిటిష్ పురస్కారం ‘బ్రిటిష్ విక్టోరియా క్రాస్’. దాని స్థానే అంతే ప్రాముఖ్యంతోకూడిన అత్యున్నత పురస్కారం రూపొందించాలని అప్పటి జనరల్ హీరాలాల్ కోరారు.
ఆ మేరకు సావిత్రి బాయ్ ఖణోల్కర్‌కు బాధ్యత అప్పగించారు. అనేక భారతీయ పౌరాణిక గాథలు ఔపోసన పట్టిన మీదట, 1.375 అంగుళాలు (3.49 సెం.మీ) గుండ్రంగా కాంస్య పతకం తయారు చేసి, నాలుగు పక్కలా వజ్రచిహ్నం, పథకం మధ్యలో జాతీయ చిహ్నం, అశోక ధర్మచక్రం, మరోవైపు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ‘పరమ వీర్ చక్ర’ అక్షరాలతోకూడిన పతకరూపును ఆమె తయారుచేశారు. ఈ రెండు భాషల్లో రాసిన వాటిని రెండు కమలం పువ్వులు విడదీస్తాయి. ఈ పథకం 1.3 అంగుళాలు/ 32 మి.మీ.
వెడల్పాటి, వంగపండు (పర్పుల్) రంగు రిబ్బన్ ద్వారా, ఏటవాలైన స్వివెలింగ్ బార్‌నుండి పొడుగ్గా వేలాడి తీయబడి ఉంటుంది. ఇదే భారత సైనికులకు బహుకరించే అత్యున్నత సైనిక పురస్కారం ‘పరమ వీర్ చక్ర’. దీనిని మొట్టమొదటిసారిగా 1950 జనవరి 26న మేజర్ సోమనాథ్ శర్మకు బహుకరించారు.
ఇప్పటి వరకూ 21మంది ఈ అవార్డును అందుకోగా, వాళ్లలో 20మంది ఆర్మీవారు, ఒకే ఒక్కరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన నిర్మల్ జిత్‌సింగ్ సెక్హాన్. 1971 పాకిస్తాన్ యుద్ధంలో అత్యంత ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన ఆయనకు దీనిని బహుకరించారు. సావిత్రి బాయ్ ఖణోల్కర్ ‘పరమ వీర్ చక్ర’తోపాటు మహావీర్ చక్ర, అశోక్ చక్ర, కీర్తి చక్ర, వీర్‌చక్ర, శౌర్యచక్ర పతకాల తయారీలోనూ కీలక పాత్ర పోషించడం విశేషం.
అనేక సమయాల్లో దేశాన్ని, ప్రజలను, ఆస్తులను కాపాడి, రక్షణలో ప్రాణాలను తృణప్రాయంగా భావించారామె. సావిత్రి బాయ్ ఖణోల్కర్ భర్త మరణానంతరం రామకృష్ణ మఠంలో చేరి 1990 నవంబర్ 26న తనువు చాలించారు. అమె తయారు చేసిన వివిధ శౌర్య పతకాలు, పరమ వీర్ చక్ర పురస్కారం మనలను ఎల్లవేళలా జాగృతం చేస్తూనే ఉంటాయి.
ఐ.ప్రసాదరావు