26-11-2024 12:00:00 AM
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి స్వేచ్ఛ, స్వరా జ్యాల కోసం అనేక సమరయోధుల త్యాగ ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు కోసం రాజ్యాంగం అవసరం. 1946 డిసెంబర్‌లో రాజ్యాంగం కోసం ఒక కమిటీని భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
389 మంది రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు ప్రపంచ దేశాలన్నీ తిరిగి అక్కడి రాజ్యాంగాలను అధ్యయనం చేసి అనేక సార్లు సమావేశమై 64 లక్షల ఖర్చుతో 1949 నవంబర్ 26న రాజ్యాంగ రచన పూర్తి చేశారు. ‘నవంబర్ 26’ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని 2015 నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 26 నాడు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
రాజ్యాంగం మార్పు అవసరమా?
భారత రాజ్యాంగం దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా ప్రకటించింది. భారత రాజ్యాంగం అమృతోత్సవం జరుపుకుంటున్న వేళ రాజ్యాంగాన్ని మార్చాలనే వాదనను కొంతమంది తెరమీదకు తెస్తున్నారు. అయితే, బ్రిటిష్ వారు అమలు చేసిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ ప్రొసీజర్ కోడ్, పోలీసు మ్యానువల్ పోలీసు చట్టాలు, జైలు శిక్ష, ఎక్సైజ్ మొదలైన వాటిని మార్చడానికి ఎంతోమంది పదవీ విరమణ చేసిన అధికారులు కష్టపడి కొద్దిగా మాత్రమే మార్చగలిగారు కానీ, పూర్తిగా మార్చలేక పోయారు.
రాజ్యాంగంలో మన దేశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థగా పేర్కొన్నారు. రాజ్యాంగంలో కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ, భాషలకు చెందిన అన్ని విషయాలను పేర్కొన్నారు. మహిళలు, వికలాంగులు, విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మిక, కర్షక సమస్యలను వివరంగా ప్రస్తావించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వాల సంబంధాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు వంటి అన్ని విషయాలూ వివరంగా పేర్కొన్నారు.
రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ, భాషా బేధాలు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో శాసనసభ, శాసనమండలి, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కానీ, కొంతమంది కుల, మత, ప్రాంత భేదాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందుతున్నారు. గెలవడానికిగల అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వారికి రాజ్యాంగంపై గౌరవం ఉండడం లేదు. వారు రాజ్యాంగంపై అభిమానం, అవగాహన లేక రాజ్యాంగం మార్చాలని కోరుకుంటున్నారు.
బడుగు, బలహీన వర్గాలకు, నిమ్నజాతి ప్రజలకు రాజ్యాధికారంతోనే సమస్యల పరిష్కారం లభిస్తుందని అంబేద్కర్ చెప్పారు. సమరయోధులు దేశానికి స్వాతంత్య్రం సాధించాలని పోరాటాలు చేస్తుంటే అంబేద్కర్ అంటరాని తనాన్ని నిర్మూలించడానికి, నిమ్నజాతి ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం ఉండాలని కృషి చేశారు. ఎస్సీ, ఎస్టీల కోసం కేవలం 10 సంవత్సరాలు రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ, ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీల దైనందిన జీవితంలో ఎలాంటి అభివృద్ధి సాధించకపోవడంతో రిజర్వేషన్లు పది సంవత్సరాలకు ఒకసారి పెంచుతున్నారు.
భారతదేశ రాజ్యాంగ రచన అంత సులభమైన విషయం కాదు. మన రాజ్యాంగంలో సవరణలు చేసుకోవడానికీ అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజ్యాంగంలో అనేక సార్లు సవరణలు జరిగాయి. రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం కంటే రాజ్యాంగాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం చదవడం కాకున్నా రాజ్యాంగానికి క్లుప్తమైన ప్రవేశికగా భారత రాజ్యాంగ పీఠికను రూపొందించారు. మన దేశ నాయకులు కనీసం దాన్నైనా తప్పకుండా చదవాలి.
వ్యవస్థలు బలోపేతం కావాలి!
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత చైతన్యవంతులైన ప్రజలపై ఎక్కువగా ఉందని, గాడి తప్పిన పాలనను రాజ్యాంగ పరిధిలో సార్వభౌమాధికారం వెలుగులో నిత్యనూతనంగా మలచుకోవడమే దానికి పరిష్కారమని తరచుగా మాట్లాడుతుంటాం. ప్రమాదంలో పడిందంటే అర్థం ఏమిటి? దానికి ఎవరు బాధ్యులు? పాలకులు విస్మరించిన సందర్భాలు ఏమిటి? ప్రజలు ఎందుకు రాజీ పడుతున్నారు? ప్రజాస్వామిక వాదులు, మేధావుల మౌనానికి కారణం ఏమిటి? వంటివన్నీ చర్చించుకోవడం అవసరం.
ప్రపంచంలోని చాలా దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రాసుకున్న అతిపెద్ద లిఖిత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోలేమా? లేకుంటే పాలకులే ప్రజల దృష్టిని మళ్లించే క్రమంలో తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారా? అనే సంశయాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరమూ ఉంది.
‘ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజల్లో భాగంగా, ప్రజా ప్రయోజనాన్ని ఆశించి పని చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం’ అని అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఇచ్చిన నిర్వచనం అజరామరం. కాలానుగుణంగా అవసరాలను, సందర్భాలనుబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలి తప్ప బలహీన పరచుకుంటే శత్రువులకు అవకాశం ఇచ్చినట్లే. ‘చైతన్యవంతమైన ప్రజలుకూడా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావడానికి ప్రధాన వనరు’ అని రాజ్యాంగ రచన సందర్భంగా అంబేద్కర్ చేసిన సూచన అందరికీ పాఠం కావాలి.
ఆకాంక్షలకు తగ్గట్టుగా..
నేడు దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టసభలు, పాలకులు క్రమంగా తమ నిబద్ధతను కోల్పోయి ప్రజాస్వామ్యానికి ఎనలేని ప్రమాదాన్ని తెచ్చిన మాట వాస్తవం. మత ప్రమేయం లేని రాజ్యంగా నొక్కి చెప్పినా భారత సార్వభౌమాధికారం మతం గుప్పిట్లో, అంధ విశ్వాసాల కౌగిట్లో నేడు బందీ అయి ఉన్నమాట వాస్తవం కాదా? రాజ్యాంగబద్ధ సంస్థలైన ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ, రిజర్వ్ బ్యాంక్, నీతి ఆయోగ్, కాగ్‌తోపాటు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన చట్టసభలు స్వతం త్రంగా వ్యవహరించవలసింది పోయి పూర్తిగా పాలకుల పరిధిలోకి వెళ్లిపోవడం ప్రమాదంలో పడినట్లే కదా! కులమతాలకు అతీతంగా ప్రజాస్వామిక వ్యవస్థను కొనసాగించవలసిన పాలకులు ఈ రెండు అంశాలపైనే తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.
అసమానతలు, అంతరాలు, వివక్ష, నిరుద్యోగం, పేదరికం సర్వత్రా తాండవిస్తుంటే, మనం ఎంచుకున్న ప్రజాస్వామిక వ్యవస్థలు కుప్పకూలిపోతుంటే చట్టసభలు నేరస్థులు, పెట్టుబడిదారులకు నిలయాలుగా మారిపోతే ఈ దేశంలో సుపరి పాలన ఎలా, ఎప్పటికి సాధ్యం? అన్ని అనర్థాలను సవరించడానికి పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యామ్నాయ చట్టాలను చేయవలసి ఉంది. రాజకీయ పార్టీల నైతికత ప్రధాన అంశంగానూ ఉంది.
ఇలాంటి లోపాలను సరిదిద్దడం కోసం అవసరమైతే రాజ్యాంగబద్ధ్దంగా సంక్రమించిన అధికారాలను న్యాయవ్యవస్థ ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని ఆదేశించే విధంగా రాజ్యాంగ సవరణలు చేయవలసిన అవసరం ఎంతగానో ఉంది. ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామిక వాదుల ఆకాంక్షలు బలంగా వినిపించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పాలకుల సవాలుకు ప్రతిసవాలు విసరగల స్థాయికి ప్రజలూ ఎదగాలి. అప్పుడు ప్రజల ముందు పాలకులు తలవంచక తప్పదు.
డా. ఎస్. విజయభాస్కర్