12 August, 2026 | 2:16 AM

ప్రశ్నించే ప్రతి గొంతులోనూ కమ్యూనిజం భావజాలం దాగుంది

12-08-2026 12:56 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

చుంచుపల్లి / సుజాతనగర్ , ఆగస్టు 11, (విజయక్రాంతి): సమాజంలో ప్రశ్నించే ప్రతి గొంతులోనూ కమ్యూనిజం భావజాలం దాగి ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రలో భాగంగా 7చుంచుపల్లి మండల కార్యాలయంలో సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎండి రజబ్ అలీ స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం చుంచుపల్లి, సుజాతనగర్ మండల కేంద్రాల్లో జరిగిన చైతన్య యాత్ర యాత్రల బహిరంగ సభల్లో అయన మాట్లాడారు. సమాజ పరిణామాలపై అవగాహన పెంచి ప్రజలను చైతన్యపరిచే శక్తి ఒక్క కమ్యూనిస్టులకే ఉందన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లక్షలాది మంది విద్యార్థులు, యువత సాగించిన ఐక్య ఉద్యమాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చిందని గుర్తుచేశారు. కష్టపడి చదివిన యువతకు ఉపాధి కల్పించకుండా వరుస పేపర్ లీకేజీలతో వారి భవిష్యత్తుతో ఆడుకోవడం దారుణమన్నారు.

దేశ సంపదంతా కొద్దిమంది బడా కార్పొరేట్ల చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని, రాత్రింబవళ్ళు శ్రమించే కార్మికులు, అన్నదాతలైన రైతులకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ కార్మిక చట్టాలను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. నింగినంటిన నిత్యావసరాల ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని, పంటలకు సరైన మద్దతు ధర లేక రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

పాలక నాయకుల్లో అహంభావం తగదని, అభివృద్ధికి సహకరించి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు, రహదారులు, వంతెనలు ఇతర అభివృద్ధి పనులు మునుపెన్నడూ లేనివిధంగా జరుగుతున్నాయని, ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామన్నారు. రెండు నెలల్లో కొత్తగూడెం కార్పొరేషన్తోపాటు కొత్తగూడెం నియోజకవర్గంలో మార్పు చూడబోతున్నారన్నారు.  కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా,  సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సరిరెడ్డి పుల్లారెడ్డి, మున్నా  లక్ష్మీ కుమారి, నరాటి ప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.