calender_icon.png 21 January, 2026 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

21-01-2026 12:00:00 AM

గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే పాయం

అశ్వాపురం, జనవరి 20 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మరోసారి తన సామర్థ్యాన్ని చాటింది. అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించగా, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన గృహాల్లో అడుగుపెట్టించారు. సొంత ఇంటి కల నెరవేరిన ఆనందంలో లబ్ధిదారులు రెడ్డి మహేష్ కుమార్  రవళి దంపతులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును శాలువాతో ఘనంగా సన్మానించారు. తమ కుటుంబానికి శాశ్వత నివాసం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణాన్ని సృష్టించింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేద కుటుంబాలకు స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నామని అన్నారు. “ఇల్లు కేవలం గోడలు కాదు.. భద్రత, గౌరవం, భవిష్యత్తుకు బాట” అని పేర్కొంటూ, ప్రతి అర్హుడైన పేదవాడికి ఇంటి హక్కు కల్పించడమే ప్రభుత్వ దృఢ సంకల్పమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని అర్హులైన కుటుంబాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోపాలకు తావు లేకుండా పారదర్శకంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో ఆశాకిరణంగా నిలుస్తోందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.