19 August, 2026 | 2:50 AM

ప్రాపర్టీ, దొంగతనం కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి

19-08-2026 12:04 AM

పాల్వంచ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు 

పాల్వంచ, ఆగస్టు 18, (విజయక్రాంతి): పాల్వంచ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రాపర్టీ, దొంగతనాల కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు.  పాల్వంచ పోలీస్ స్టేషన్ను మంగళవారం  ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం అధికారులు, సిబ్బందితో స్టేషన్లోని వివిధ విభాగాల పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్  పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేశారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ప్రాపర్టీ కేసులు, దొంగతనం కేసుల వివరాలను అడిగి తెలుసుకొని, పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించడంతో పాటు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి, చోరీకి గురైన ఆస్తి రికవరీ దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. ఎన్డీ,పీఎస్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని  ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

స్టేషన్ పరిధిలోని సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లను నిరంతరం సమీక్షిస్తూ సంబంధిత వ్యక్తుల కదలికలు, కార్యకలాపాలపై నిఘా కొనసాగించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్ 2.0 వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తూ పోలీసు సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించాలన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోలట్స్ వాహనాలతో నిరంతరం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని,

డయల్-112కు ఫోన్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పి ఆర్ సతీష్ కుమార్, సీఐ సతీష్, ఎస్త్స్రలు నాగరాజు, సాయి కిషోర్ రెడ్డి, విజయ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.