calender_icon.png 17 December, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన చివరి విడత.. గ్రామ సంగ్రామ సమరం

17-12-2025 07:26:52 PM

* జిల్లాలో 83.1 శాతం ఓటింగ్ నమోదు

* అత్యధికంగా ఉప్పునుంతల మండలంలో 87.3 శాతం, అత్యల్పంగా అమ్రాబాద్ మండలంలో 75.6 శాతం పోలింగ్

* ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

అచ్చంపేట: గ్రామ సంగ్రామంలో కీలకమైన చివరి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నాగర్ కర్నూల్ జిల్లాలలో ప్రశాతంగా ముగిశాయి. జిల్లాలోని ఏడు మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల పక్రియను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పరిశీలించారు. జిల్లాలో చివరి దశ ఎన్నికలలో భాగంగా బుధవారం అచ్చంపేట, బల్మూర్, లింగాల, చారగొండ, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర మండలాలలోని 134 గ్రామ పంచాయతీలలో సర్పంచు, 1,064 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకే గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసింది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నికల ఫలితాల లెక్కింపును ఆరంభించారు. చివరి విడత ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన పోలింగ్ లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి కనబరిచారు. జిల్లాలో 83.01 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,79,464, ఓట్లకు, 1,49,222 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఉప్పనుంతల మండలంలో 87.3 శాతం, అత్యల్పంగా అమ్రాబాద్ మండలంలో 75.6 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అచ్చంపేట మండలంలో 86.09 శాతం, బల్మూర్ మండలంలో 80.06, లింగాల మండలంలో 81.02, పదర మండలంలో 81.05, చారగొండ మండలంలో 86.06 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోశ్ వెల్లడించారు.

* భారీ బందోబస్తు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అధనపు బలగాలను మోహరించారు. ఫలితాల లెక్కింపు సమయంలోనూ గొడవలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. బల్మూర్ మండలం జినుకుంటలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.