అక్రమార్కులకు యంత్రాంగం వంత
- మామూళ్ళు ఇస్తూ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
- బిల్డర్ల కనుసన్నల్లో అధికారగణం
- బల్దియాపై తీవ్రస్థాయిలో ప్రజల ఆరోపణలు
- జిల్లా అధికారులు కదిలివస్తేనే చర్యలుంటాయా ?
సంగారెడ్డి, నవంబర్ 13(విజయక్రాంతి):కింది స్థాయి సిబ్బంది చేతివాటం, అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా అక్రమ నిర్మాణదారులు స్పీడు పెంచారు. కొంత మంది నిర్మాణదారులు మున్సిపాలిటీ నుంచి భవణాల నిర్మాణం కోసం జీ ప్లస్ 2 పర్మిషన్ తీసుకొని ఐదారు అంతస్తుల వరకు నిర్మాణాలు జరుపుతున్నారు. మరికొంత మంది నిర్మాణదారులు అప్పట్లో ఉన్న ప్రజా ప్రతినిధుల కనుసన్నుల్లో ఉండి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మా ణాలను చేపడుతున్నారు.
దీంతో మున్సిపాలిటీకి చెందిన కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపాలిటీ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్ధమవుతుందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతా లలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతుంది. మున్సిపాలిటీ పరిధిలోని పీఎన్‌ఆర్, పార్వతీపురం, నవ్య వెంచర్ ప్రాంతంలో, అలాగే ఇంద్రేశం ప్రధాన రహదారికి ఇరువైపు లా ఈ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.
అక్రమ నిర్మాణాల కారణంగా భవిష్యత్లో మౌలిక వసతుల కల్పనలో మున్సిపాలిటీకి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉన్నా అధికారులు ఎందుకు ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు. ఫిర్యాదులు అందినప్పుడు తూతూ మంత్రంగా మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు తప్ప కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు.
ప్రజల దృష్టిలో నుంచి తప్పించుకునేందుకు కేవలం నోటీసుల పేరుతో హైడ్రామా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు చాలా అక్రమ అనుమతులు జారీ చేయడమే కాకుండా ఇష్టారీతిగా భవన నిర్మాణాలు చేపట్టారు. తాజాగా మున్సి పాలిటీగా రూపాంతం చెందడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని భావించినప్పటికీ అక్రమ నిర్మాణాల జోరుమాత్రం పెరిగిపోతుంది.
నిద్రావస్థలో అధికారులు....
మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతున్నా నిమ్మకునీరత్తినట్లు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నా ఆవైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలున్నాయి. అంతేగాకుండా బల్దియా సిబ్బంది పనితీరుపై అక్రమార్కులు బహిరంగంగానే వ్యంగ్యంగా మాట్లాడడం గమనార్హం.
తామింతే..వారంతే అన్న చందంగా వ్యవహారం కొనసాగుతోంది. చర్యల మాట దేవుడెరుగు మున్సిపల్ అధికారులను నిట్టనిలువునా బజారుపాలు చేస్తున్నారు. తనిఖీలు చేస్తే ఏమవుతుంది..వారిని ఎలా చూసుకోవాలో మాకు తెలు సు అంటూ బహిరంగంగానే మాట్లాడడం శోచనీయమని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందిం చి ఇంద్రేశం మున్సిపాలిటీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణలపై చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.




