24-03-2025 01:26:54 AM
కామారెడ్డి, మార్చి 23 (విజయక్రాంతి): భూమి లేకున్నా ఉన్నట్టు నకిలీ పాసుపుస్తకాలు పొంది బ్యాంకులో రుణాలు పొందిన నకిలీ రైతుల బాగోతం ఇది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో 273 ఎకరాలకు రెవెన్యూ అధికారులు నకిలీ పుస్తకాలు జారీ చేశారు.
ఈ నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో ధరణిలో మార్చుకొని ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు, సంక్షేమ పథకాలు రుణాలు గత ప్రభుత్వా హయాంలో మింగేశారు. నకిలీ పుస్తకాల కుంభకోణంలో జుక్కల్ తహసీల్దార్ కార్యాలయం లో పనిచేసే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ గతంలో పనిచేసిన తహసీల్దార్ సహకారంతో పెద్ద ఎత్తున భూములను లేకున్నా ఉన్నట్లు డబ్బులు తీసుకుని జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జుక్కల్ మండల కేంద్రం లోని బీరప్ప మందిర్ వద్ద 321 సర్వేనెంబర్, రుద్రపహాడ్ 4వ సర్వే నెంబరులో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఎవరెవరు పేరు మీద ఉన్నాయి, ఏయే సర్వేనంబర్ భూములకు నకిలీ పట్టా పాస్ పుస్తకాలు జారీచేశారో అన్నదానిపై విచారణ జరిగితే అవినీతి అక్రమార్కులు చిక్కే అవకాశం ఉంది.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అక్రమ నకిలీ పాస్ పుస్తకాల బాగోతంపై విచారణ చేపట్టాలని జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో సైతం నకిలీ పాస్ పుస్తకాల ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందిన భాగోతాలు ఉన్నాయి. ప్రభుత్వం రుణమాఫీ చేసిన వారిలో ఈ ఆక్రమ నకిలీ పాసు పుస్తకాల రైతులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.