24-03-2025 01:27:09 AM
రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ కుమార్
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 23(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సంస్థ గత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్, జేబీ, జేబీ, జెఎస్ జిల్లా కోఆర్డినేటర్ ఈరవర్తి అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వోడపల్లి గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు అధ్యక్షతన జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండే విఠల్ తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం సర్వస్వం అంకితం చేసిన గాంధీ లాంటి మహనీయులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో బిజెపి పార్టీ మతతత్వ రాజకీయాలను కొనసాగిస్తుందని ఆరోపించారు. క్విట్ ఇండియా ఉద్యమానికి ద్రోహం చేసింది వారే అన్నారు .
బిజెపి పార్టీ మళ్లీ అంటరాని తనాన్ని ప్రవేశపెట్టినందుకు పన్నాగం పండుతుందని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ లేకపోతే పరిస్థితి ఎలాగ ఉండేదో అందరికీ తెలుసన్నారు. అదాని, అంబానీ లాంటి కార్పోరేట్ వ్యవస్థల కోసం బిజెపి పని చేస్తుందన్నారు.
రాహుల్ గాంధీ దేశంలో కులగనన చేయాలని డిమాండ్ చేస్తే బిజెపి నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరుగుతున్న బిజెపిలోని బీసీ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్రంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదం చేసి కేంద్రానికి పంపించిందని బేషరతుగా తొమ్మిదవ షెడ్యూల్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పని చేస్తుందని, అణగారిన వర్గాల కోసం రాహుల్ గాంధీ పాటుపడుతున్నారన్నారు.
ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ చేసిందని బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదని మందకృష్ణను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రణాళిక ప్రకారం అమలు చేస్తుందని ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, వరి 500, రుణమాఫీ ఉద్యోగాల భర్తీ ఇలా అనేక పథకాలను ప్రవేశపెడుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పని ఎక్కువ చేస్తుందని పబ్లిసిటీ తక్కువ చేస్తుందని కానీ బిఆర్‌ఎస్ పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ చేస్తుందని చురుకులు అంటించారు.
పార్టీ ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధన్ పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భాస్కర్, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే సక్కు, జెడ్పి మాజీ చైర్మన్ గణపతి, యువజన జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, ఏఎంసీ మాజీ చైర్మన్ లు గాదవేణి మల్లేష్,మునీర్, మాజీ ఎంపీపీ బాలేశ్, పార్టీ మండల అధ్యక్షుడు మసాదే చరణ్, నాయకులు వసంతరావు, అసద్, శివప్రసాద్, గోపాల్ నాయక్, రఫు ,జావీద్ తదితరులు పాల్గొన్నారు.