22 April, 2026 | 2:02 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

మాస్టర్ ప్లాన్‌కు మోక్షం ఎన్నడో!

09-12-2024 12:18 AM
  1. విస్తరించిన ఖమ్మంలో ఇంకా పాత ప్లానే..
  2. పెండింగ్‌లో వేలాది ఇళ్ల అనుమతుల దరఖాస్తులు 
  3. సుడా విస్తరణతో మరిన్ని కష్టాలు 

ఖమ్మం, డిసెంబర్ 8 (విజయక్రాంతి): రాబోయే ఇరవై ఏళ్లలో ప్రజల అవసరాలు తీర్చే ఖమ్మం మాస్టర్ ప్లాన్‌కు ఏళ్లు గడుస్తున్నా మోక్షం లభించడం లేదు. పెరిగిన జనాభా, అవసరాల రీత్యా ఖమ్మం నగరానికి నూతన మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలని ఎప్పుడో నిర్ణయించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా పాత మాస్టర్ ప్లాన్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు.

ఎన్నో ఏళ్ల కిందట అప్పటి జనాభాకనుగుణంగా ఏర్పాటు చేసిన పాత మాస్టర్ ప్లాన్‌నే నేటికీ అమలు చేయడం వల్ల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. సరైన మాస్టర్ ప్లాన్ లేని కారణంగానే ఇటీవల ఖమ్మం పట్టణాన్ని, పరిసర కాలనీలను మున్నేరు వరద ముంచెత్తింది. గత పదేళ్లలో ఖమ్మం నగరం ఎంతో విస్తరించింది. నగర జనాభా 7 లక్షల వరకు చేరు కుంది.

దీంతో ప్రణాళికబద్ధమైన మాస్టర్ ప్లాన్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణ అనుమతులకు, ఎల్‌ఆర్‌ఎస్ ధృవ పత్రాలు జారీ వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది ఇళ్ల మీదుగా 80 అడుగులు, 180 అడుగుల రోడ్లు పోతున్నట్లు ఇప్పుడున్న పాత మాస్టర్ ప్లాన్ చూపిస్తుంది.

కానీ వాస్తవానికి అవి క్షేత్రస్థాయిలో లేవు. కానీ మాస్టర్‌ప్లాన్‌లో ఉండటం వల్ల ప్రజలు నిర్మాణ అనుమతుల విషయంలో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అనుమతులు ఇవ్వడంతో ఇబ్బం దులు ఎదురవుతున్నా యి. నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికీ వేలాది దరఖాస్తులు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో పెండింగ్‌లో ఉన్నాయి.

అంతేకాకుండా మున్నేరు, నగరం చుట్టు పక్కల ఉన్న చెరువులు, లకారంచెరువు, ఖనాపురం చెరువు తదితర చెరువులు, కుంటలు, నాలాలకు సంబంధించి బఫర్ జోన్ల సంగతి అగమ్యగోచరంగా ఉంది. మాస్టర్ ప్లాన్ లేని కారణంగా ఇష్టానుసారంగా బఫర్ జోన్లలో కూడా అనుమతులు ఇవ్వడంతో భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. 

సుడాలో గ్రామాల విలీనం

2017లో అక్టోబర్ 24న ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు 7 మండలాలు, 46 గ్రామ పంచాయతీలను కలిపి స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా)ని ఏర్పాటు చేశారు. అనంతరం ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, చింతకాని, కొణిజర్ల, రఘునాధపాలెం మండలాల్లోని 46 గ్రామం పంచాయతీలకు కలిపి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకంలో భాగంగా ఈ ప్లాన్‌ను తయారు చేశారు. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, రిక్రియేషన్, పబ్లిక్, సెమీ పబ్లిక్  జోన్లు, రోడ్లు, వాటి వెడ ల్పు, చెరువులు, కాల్వలు, వాగులు, నాలా లు తదితర అంశాలను ఈ మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖలు సేకరించిన వివరాలతో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. 

ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్ ఖమ్మం కార్పొరేషన్ మొత్తం కూడా సరిగా అమలు కావ డం లేదు. తాజాగా సుడా పరిధిలోకి మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీతో పాటు 18 మండలాల్లోని 279 గ్రామాలను కూడా కలిపారు. పెరిగిన జనాభా అవసరా లు రీత్యా నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. 

త్వరలో మాస్టర్ ప్లాన్‌పై సమావేశం

కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించి, కేంద్రానికి  పంపకపోతే కేంద్రం నుంచి అమృథ్ పథకం కింద రావాల్సిన నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. త్వరలోనే నగరపాలక అధికారులు సమావేశమై, నూతన మాస్టర్ ప్లాన్ పై చర్చించే అవకాశం ఉంది. 

విలీన మున్సిపాలిటీల్లోనూ ఇబ్బందులు 

సుడాలో విలీన మున్సిపాలిటీల్లో నూ మాస్టర్ ప్లాన్ పట్టాలు ఎక్కకపోవడంతో  ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైరా 2018లో మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అవతరించింది. 20 వార్డులు ఉం డగా 30వేలకు పైగా జనాభా ఉంది. ఇం దులో తాజాగా మూడు గ్రామాలు విలీనమయ్యాయి. మధిర కూడా 2014లో ము న్సిపాలిటీగా మారింది. 34వేలకు పైగా జనాభా ఉంది.

22 వార్డులు ఉన్నా యి. మడుపల్లి, అంబారుపేట, ఇల్లెందులపాటు తదితర గ్రామాలు ఈ మున్సి పాలిటీలో విలీనమయ్యాయి. దీంతో సరైన ప్రణాళిక లేకపోవడంతో వసతుల కల్పనలో ఇబ్బంది వస్తుంది. సత్తుపల్లి 2018 లో మున్సిపాలిటీగా మారింది. 45 వేలకు పైగా జనాభా ఉంది. 23 వార్డులున్నాయి. తాజాగా ఒక గ్రామం విలీనం అయింది. 2022లో ప్రతిపాదనలు పం పగా ఇక్కడ కూడా ఇంతవరకు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయలేదు. 

మాస్టర్ ప్లాన్‌పై మంత్రి తుమ్మల దృష్టి 

జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరానికి సంబంధించి కొత్త మాస్టర్ ప్లాన్ తయారుపై దృష్టి పెట్టారు. ఈ మేరకు అధికారులను కూడా ఆదేశించారు. కొత్త మాస్టర్ ప్లాన్ ఉంటేనే కేంద్రం నుంచి అమృత్ పథకం కింద నిధులు వస్తాయి. దీంతో మంత్రి సాధ్యమైనంత త్వరగా నూతన మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది.