05-01-2026 02:11:44 AM
ఈ కమర్షియల్ సివిలైజేషన్‌లో నా కరఘడియ సుఖమిచ్చేందుకు ఆ స్త్రీ విలువ రూపాయిన్నర. మా కాంట్రాక్టుకి నిర్ణయించుకోని కన్సిడరేషన్ ఒక రూపాయి ఎనిమిదణాలు. వ్యక్తినిబట్టి, సమయాన్ని బట్టి, స్టేటస్‌ని బట్టి, పర్సు బట్టి విలువ హెచ్చవచ్చు. లేక తగ్గొచ్చు. కాని, ఆనాడు ఆమె నా వద్ద పుచ్చుకున్నదంతే. పొరపాటు. ఆమెకి నేనిచ్చిందంతే. అంతకన్న అధికం ఇస్తే ఆమె వద్దనకా పోను.
తక్కువ ఇస్తే తగవు చెయ్యకా పోను. అయితే.. ఆ వేళకి నే నివ్వగలిగిందంతే. ఆనాడు, బస్టాండు దగ్గర కలిసే నామెని. బాగా చీకటిపడ్డాక. పకోడీల దుకాణం దగ్గర కిరసనూనె బుడ్డీ మందంగా వెలుగుతోంది. రెపరెపలాడుతోంది. ఆమె కట్టుకున్న తెల్లటి చీరమీద ఎర్రటి మసక వెలుగు దోబూచులాడుతోంది. ఆ వెళ్తురులో, నీడల్లో ఆమె మాసిన ఎర్ర రవిక అనిపించలేదు నాకు. కానీ అణిగిన ఒంపులు అణక్కుండా పిలుస్తున్నాయి.
కిళ్లీతో ఎర్రబడిన పెదములు విలాసంగా వంకీలు తిరిగాయి. కనుబొమ్మల కింద కళ్లు చిలిపిగా కదిలాయి. నీలి కనుపాపలు మిలమిల మెరిశాయి, కొంటెగా సంజ్ఞలు చేశాయి. నల్లటి కురుల్లో దాగిన జాజిమల్లెల వాసన ఉల్లిపాయ పకోడీల నూనె వాసనతో మిళితమై గుమాయించింది. నా చూపులు ఆమె వళ్ళంతా పాకినాయి. ఆమె మీద నిలిచాయి. నిలవకుండా, పొంగి వంగిన గీతల మీద జారాయి. ఆమెని వదలకుండా తిరిగాయి.
చుట్టూ గొడవ, రొద, ధ్వని. గుడ్డి వెల్తుర్నీ, ముసక చీకట్నీ, ఎర్ర ధూళినీ ఆమె చూపులు చీలుస్తున్నాయి. నన్ను లాగుతున్నాయి. చుట్టూ గడబిడ, గందరగోళం. కార్కు సోడాలకి ప్రాణాలు పోతున్నాయి. శబ్దం చెయ్యడానికే తిరుగుతున్నాయి జట్కాల చక్రాలు. సైకిళ్లు, రిక్షాలు, కార్లు, బస్సులు, బళ్ళు, మనుష్యులు. అన్నీ, అంతా కలిసి, చప్పుడు, చప్పుడు. చప్పుడుల్లో చప్పుడు చెయ్యకుండా పిల్చింది.
పిలవకుండా రమ్మంది. మాట్లాడకుండా కదిలింది. పోయే నామె వెంట, మనసులో సందడితో, ఒక్కటే కాంక్షతో, అమిత కామంతో. కలుసుకున్నా నావిజ్ఞి మళుపులో. మాట్లాడే దేదో మాట లనవసరం అయినా, ఇద్దరికీ వప్పుదలేదని, ఇద్దరికీ తెలుసు. వేరే అడగనక్కర్లేదు, చెప్పనక్కర్లేదు. మళుపులో ఉన్న గ్యాస్ లైటు వెల్తుర్లో ఆమె, నల్లగా మెరిసింది. ఎర్రగా నవ్వింది. వేడిగా చూసింది.
ఇంతట్లో రిక్షా వచ్చి వాలింది. అంతలోనే రిక్షాలో ఆమె, రిక్షాలో నేను, రిక్షాలో మనిషి - పక్క మనిషి. చేతిలో చెయ్యి, బలంగా, మోటుగా, గరుగ్గా ఉన్న చెయ్యి, నా వాంఛని రేకెత్తించింది. నన్ను కంపితుణ్ణిగా చేసింది. రిక్షా పోతోంది సందుల్లోంచి. అట్టే దూరంలేదు సముద్రతీరానికి. తెల్లటి ఇసక ఇంకా కొంచెం వెచ్చగా ఉంది. నడుస్తూ నా భుజం పట్టుకుంది. నా చేతిని లాక్కొని దాచేసుకొంది.
ఆమెవరో నే నడిగేనా? నే నెవరో ఆమె కావాలా? మౌనంగా నడిచి కూలబడ్డాం, జాలరివాళ్ళ పడవలవార. పడవల మధ్య మెత్తటి ఇసక. పడవల మధ్య ఉప్పునీటి చేపల వాసన. పడవల మధ్య చల్లటి గాలి. పడవల మధ్య ఆమె నేనూ, ఉక్కిరిబిక్కిరిగా ఉంది నాకు.
ఆపలేని తాపం కాళ్ళలో కంపం పుట్టిస్తోంది. కంపిస్తున్న నన్ను బలంగా మోటుగా ముద్దులాడింది. ఘాటైన వాసన. చవకరకాల సబ్బు, స్నో, ఫేస్ పౌడర్ కలిసి వేసే వాసన. తడిసిన, మాసిన ఎర్ర రవిక చెమట వాసన. అన్నీ కలిసిన మనిషి వాసన. పిచ్చెత్తించి కళ్ళకి పొరలు కప్పే ఆడదాని వాసన. మధురమైన సువాసన. చేతులు పెనవేసుకున్నాయి ఆమెని. నా గుండెల గుబగుబల కామె వెచ్చటి రొమ్ములు జవాబులిచ్చాయి.
గుండెల తలుపులు తట్టేయి. నెత్తురు వదరకి గట్లు తెంచేయి. నా అణచుకోలేని ఆరాటాని కామె సన్నగా నవ్వింది. ఆ నవ్వుకి చీకటి వెన్నెల కాసింది. రాత్రి చీకటిగా ఉంది. చల్లగా వుంది. ఆ చీకట్లో ఆమె నాక్కనిపించలేదు. ఆమె సజల జలద నీలవర్ణం నీలరాత్రిలో కలిసిపోయింది. కాని, ఆ చీకట్లో ఆమె తప్ప నాకింకేదీ కనిపించలేదు. పొంగిన వక్షాన్ని దిండుగా చేసుకొని, ఆమె పెదవుల తీపిని తీసేసుకొని, ఆమె సత్తువ నెదుర్కొని, కలిశేను ఆమెని, సముద్రుడి సమక్షంలో, చంద్రుడు లేని ఆకాశాన్ని, చాందినీ చేసుకొని.
నా రక్తం చల్లబడ్డాక, లేచి కూర్చున్నాక, తడుముకొంటూ తీసేను జేబులోంచి, తీసినది పర్సు. తీసేనే గాని, ఎందుకో చలిగా చలిచలిగా పుట్టుకొచ్చింది వణుకు చేసినది పాడుపని కాదు. చేస్తున్నది పాడుపని. వెల లేనిదానికి వెల కడుతున్నాను. అమూల్యమైన దానికి మూల్యం నిర్ణయిస్తున్నాను. బజార్లో వస్తువులాగ ఆనందాన్ని, ఆడదాన్ని కొనుక్కొంటున్నాను. అణా ఇస్తే పకోడీల పొట్లం దుకాణంలోంచి చేతిలో కొస్తుంది.
రూపాయిన్నర ఇస్తే శేరు బియ్యం చీకట్లోంచి వెలుగులోకి వస్తాయి. కాని వాటికి రోజునిబట్టి ఖరీదుంది, కొలతుంది, ఇంతకింత చొప్పున లెక్కుంది. అవన్నీ ‘వస్తువులు. వస్తువుల క్రింద జమకట్టి కొనుక్కొనే ఈ మనిషి ఖరీదు నిర్ణయించలేదనీ, కనీసం బేరమాడి ధరలెలా ఉన్నాయో కూడా తెలుసుకోలేనే లేదనీ, అయ్యో, ఈ లోకంలో ఫికస్డ్ ప్రైసెస్ లేని ‘వస్తువుల్లో‘ ఇదొకటనీ. పర్సు తీస్తుంటే గుర్తొచ్చింది. నా కోరిక తీర్చుకొందికి ఆడదాన్ని అద్దెకి తీసుకొందికి ముందుగా ధర కనుక్కోలేదు. తనని తనే అమ్ముకోవాల్సిన ఈ ‘వస్తువు‘ నీచాతి నీచం అంతటి హీనాతి హీనం.
పర్సు తీశాను. ఆమె నన్ను గమనించడం లేదు. ఎర్ర రవిక వెనక నల్లటి రొమ్ములు దాగుంటున్నాయి. తెల్లటి చీర కుచ్చెళ్ళు మడతలు పడుతు న్నాయి. మల్లెపువ్వుల దండ కోసం మోటుచేతులు ఇసకలో వెతుకుతున్నాయి. వెతుకుతున్నాయి నా చేతులు పర్సులో చిల్లర కోసం. నా గుప్పెట్లో కొచ్చిన మూడర్ధరూపాయిలు, ఆమె మొలలోకి పోయాయి. మౌనంగా పుచ్చుకుంది.
తరువాత ఆఖరుసారిగా నన్ను చేతుల్తో లాక్కొని ముద్దు పెట్టుకుంది. నవ్వింది. తెలియని ఆనందంతో, కాని, దుఃఖంతో, అవమానం వల్ల కలిగిన సిగ్గుతో, ఆమెని నేకూడా కవిలించుకొని తలదాచుకున్నాను. ఆరాత్రి ఆమెని అవమానించినందుకు, ఆమెనే కాదు, స్త్రీజాతిని అవమానించినందుకు, స్త్రీజాతినే కాదు, మానవలోకాన్నే అవమానించినందుకు.
నన్నూ, ఆమెనీ సర్వాన్నీ అవమానించినందుకు, మానవ జీవితం, అనంతంగా సాగేందుకుగాను మానవులకి భగవంతుడు అయాచితంగా ప్రసాదించిన అమర సౌఖ్యాన్నే అవమానించినందుకు నన్నూ నా జాతినీ తిరుగులేని ఘోర శాపాగ్నికి గురిచేసి లేక, కాళ్ళ కింద తొక్కి మట్టితో కలిపి, లేక మంటలో విసిరి భస్మం చేయడానికి బదులు ఆమె నన్ను బలమైన చేతుల్తో మృదువుగా కావిలించుకొని పొంగిన పాలిండ్లకి మెత్తగా అన్చుకొని, వెచ్చటి పెదవుల్తో తియ్యగా ముద్దులాడింది! కాని - తెలుసో తెలియకో నన్ను ఆ రీతిగా క్షమించడంలో తన సహజ స్త్రీ లక్షణంతో నన్నాదరించి బుజ్జగించడంలో ఆమె తన జ్యేష్టత్వాన్ని చూపించింది.
తన జ్యేష్టత్వాన్ని తారాపథం దాటించింది. అధోస్థానంలో ఉంటూ, ఇంకా కిందకి జారిపోతున్న నాపై వెన్నెల వర్షం కురిపించింది. నాకు చేయూతనిచ్చి లేవదీసింది. ఆడదాని మనస్సు చూపింది. చివరికి ఆమె వెళ్లిపోయింది. ఆ చీకట్లో ఎక్కడికో, ఈ కమర్షియల్ సివిలైజేషన్‌లో ధరల్లేని బజారులో ఒకనాటి రాత్రి వెలలేని దాని విలువ రూపాయిన్నర!!
సేకరణ: రాచకొండ విశ్వనాథ శాస్త్రి ‘ఆరు సారా కథలు’ సంకలనం నుంచి