డీపీఆర్ టెండర్ రద్దు చేసి ఎమ్మెల్యే చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
రూ.8కోట్ల స్కాంలో సూత్రధారులు ఎవరు!!??
మున్సిపల్ అధికారులపై ఫిర్యాదు చేస్తాం
జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్11, (విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి పారదర్శకత లేకుండా నిర్వహించిన రూ.9 .60 కోట్ల డిపిఆర్ టెండర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేసి, ఎమ్మెల్యే కూనంనేనీ చిత్తశుద్ధి నిరూపించు కోవాలని జైభీమ్ రావు భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.
మంగళవారం జేబీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో యెర్రా కామేష్ మాట్లాడుతూ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం డిపిఆర్ లో రూ 9 .60 కోట్ల విలువచేసే టెండర్ ను కేవలం మూడు రోజులు మాత్రమే సమయం కేటాయించి మూడు రోజుల్లోనే టెండర్ ఓపెన్ చేయడం పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమని , కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చినప్పుడు వాటిని రద్దు చేసి మరల టెండర్ నిర్వహించాలని అలా చేయకుండా మున్సిపల్ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్ ఓపెన్ చేసీ నిబంధనలను తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు.
టెండర్ ఓపెన్ చేసిన అధికారులపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రూ 9. 60 కోట్ల పనికి కనీసం 14 రోజుల గడువు ఇవ్వాలనే ఈ ప్రొక్యూర్మెంట్ నిబంధనలు ఉన్నాయన్నారు. టెండర్ ప్రక్రియలో రూ 8కోట్ల స్కామ్ జరిగే అవకాశం ఉందని అసలు స్కాంలో సూత్రధారులు ఎవరని ప్రశ్నించారు??అధికారులు, స్థానిక శాసనసభ్యులు తక్షణమే టెండర్ రద్దు చేయాలని, లేనియెడల కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి డిపిఆర్ టెండర్ రద్దు అయ్యేవరకు పోరాడుతామని,అవసరమైతే న్యాయస్థానానికైనా వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జునరావు, కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు నాగుల రవికుమార్,పట్టణ అధ్యక్షుడు గజ్జల శంకర్, వినయ్, సోను, మున్న తదితరులు పాల్గొన్నారు






