24 August, 2026 | 2:54 AM

తవ్వినకొద్దీ ఆస్తులు!

22-05-2024 01:23 AM

ఏసీబీ వలలో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు 

14 చోట్ల ౧౨ గంటలపాటు ఏసీబీ సోదాలు  

ప్రాథమికంగా 3.50 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు 

17 చోట్ల స్థిరాస్తులు, ఘట్‌కేసర్‌లో 5 ప్లాట్లు

శామీర్‌పేట్‌లో విల్లా, వైజాగ్‌లో స్థలాలు 

38 లక్షల నగదు, 60 తులాల బంగారం

ఏపీ, తెలంగాణలో ఆస్తులు కూడబెట్టిన ఏసీపీ 

ఉమామహేశ్వర్‌రావు అరెస్టు.. నేడు కోర్టుకు 

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 21 (విజయక్రాంతి): రెండు బ్యాంకు లాకర్లు, 17 చోట్ల స్థిరాస్తులు, ఘట్‌కేసర్‌లో 5 ప్లాట్లు, శామీర్‌పేట్‌లో ఓ విల్లా, వైజాగ్‌లో ఖరీదైన స్థలం, ఇంట్లో రూ.38 లక్షల నగదు.. 60 తులాల బంగారు ఆభరణాలు, కిలోల కొద్ది వెండి.. ఇవి ఏదో బ్యాంకు అధికారులు వేలం వేసిన సొమ్ముకాదు. నేరాలను అదుపు చేయాల్సిన ఓ పోలీస్ అధికారి అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల జాబితా. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అనుమానంతో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా దొరికిన సొమ్ము ఇదంతా. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.3.50 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఉమామహేశ్వర్‌రావు ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన కేసులో విచారణాధికారిగా కూడా ఉండటం గమనార్హం. ఉమామహేశ్వర్‌రావును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. బుధవారం ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. 

14 చోట్ల సోదాలు

ఉమామహేశ్వర్‌రావుపై ఫిర్యాదులు రావటంతో ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో ౧౪ చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉమామహేశ్వరావు ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలకు ఉమామహేశ్వర్‌రావు మొద ట సహకరించలేదు. కానీ, చివరకు దిగిరాక తప్పలేదు. ఏసీబీ అధికారులు ఉమామహేశ్వర్‌రావు బంధువులు, స్నేహితులు, బినామీల ఇండ్లలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు ౧౨ గంటలపాటు సోదాలు నిర్వహించారు.

ఏసీపీ రూ.3.50 కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. రెండు బ్యాంకు లాకర్లను బుధవారం తెరుస్తామని చెప్పారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఉమామహేశ్వర్‌రావు అబిడ్స్, జవహర్‌నగర్, సీసీఎస్, సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్‌గా, ఇబ్రహీంపట్నం ఏసీపీగా పని చేశారు. ఇటీవల సీసీఎస్ ఏసీపీగా పలు కీలక కేసుల్లో విచారణ కొనసాగారు.

ఆ డైరీలో  ఏముందో..

సోదాల్లో ఉమామహేశ్వర్‌రావుకు చెందిన ఓ డైరీని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ డైరీలో చాలా మంది పేర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో సందీప్ అనే వ్యక్తి పేరు ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆ పేరుతో పోలీస్ శాఖలో చాలా మంది ఉన్నారని, దీనిపై కూడా దర్యాప్తు చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. సాహితి ఇన్‌ఫ్రా అనే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కేసులో ఉమా మహేశ్వర్‌రావు విచారణ అధికారిగా ఉన్నారు. సాహితి కంపెనీ డైరెక్టర్ల నుంచి ఉమామహేశ్వర్‌రావు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. బుధవారం కూడా ఉమామహేశ్వర్‌రావు ఆస్తులపై సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు తెలిపారు.