24 August, 2026 | 2:05 AM

కొత్త బ్రాండ్లు ఎక్కడివి?

22-05-2024 01:28 AM

తప్పుడు వార్తలు రాస్తున్న నమస్తే తెలంగాణ 

రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాం 

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి హెచ్చరిక 

మద్యం అమ్మకాలు తగ్గితే బీఆర్‌ఎస్‌కు వచ్చిన నష్టమేంటి?

టెండర్లు లేకుండానే పదేళ్లుగా ఒక్కరే హోలో గ్రామ్ తయారీ

ఏళ్ల తరబడి ఉన్నవారికి స్థాన చలనం తప్పదు 

ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్ శాఖలో ప్రక్షాళన  

* బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అక్రమాలను,  తప్పిదాలను  ఒక్కోదానిని సరి చేసుకుంటూ వెళ్తున్నాం. గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే  తప్ప బదిలీలు జరిగేవి కావు.  టానిక్ మద్యం దుకాణాలకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపును మా  ప్రభుత్వం రద్దు చేసింది. 

 ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి):  మద్యం కొత్త బ్రాండ్ల కోసం ఇప్పటివరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, తాము పరిశీలించలేదని  రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరణ ఇచ్చారు. మద్యం సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా పటిష్టం గా నివారిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను మరింత ప్రక్షాళన చేస్తామన్నారు.  బీఆర్‌ఎస్ పార్టీ మనుగడ కష్టంగా ఉందని, అందుకే తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బీర్ల కొరతకు కొన్ని బకాయిలే కారణమన్నారు.

ప్రొహిబిషన్, అబ్కారీ శాఖలో ఏళ్లతరబడి ఒకే దగ్గర పని చేస్తున్న వారికి స్థాన చలనం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమస్తే తెలంగాణ పత్రికలో కావాలని తప్పుడు వార్తలు రాస్తూ.. బట్టకాల్చి మీద వేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. అబ్కారీ, ప్రొహిబిషన్ శాఖపై తప్పుడు వార్త రాసిన ఆ పేపర్‌పై శాఖ తరపున  రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని మంత్రి హెచ్చరించారు. తెలంగాణలో అనధికారిక మద్యం పాలసీకి తెరతీసిన ప్రభుత్వం.. కొత్త బ్రాండ్ల పేరుతో మద్యం పంపిణీకి సిద్ధమైందని, అందులో మంత్రి తమ్ముడు చక్రం తిప్పుతున్నట్లుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడంతో మంత్రి జూపల్లి ఘాటుగా స్పందించారు.

మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 19 మద్యం డిపోలల్లో అన్ని రకాల బ్రాండ్లు పుష్కలంగా  నిల్వలు ఉన్నాయని వివరించారు.  గత  బీఆర్‌ఎస్ ప్రభుత్వం టెండర్లు లేకుండానే పదేళ్లపాటు ఒక్కరికే హోలోగ్రామ్ తయారీని అప్పగించిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అక్రమాలను,  తప్పిదాలను  ఒక్కోదానిని సరి చేసుకుంటూ వెళ్లుతున్నామని మంత్రి జూపల్లి వివరించారు. బ్రూవరీల నుంచి స్టాక్  పక్కదారి పట్టకుండా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టిందన్నారు. మద్యం కొరత ఉంటే ప్రజలకు నష్టం లేదన్నారు.  గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే  తప్ప బదిలీలు జరిగేవి కావని మంత్రి ఆరోపించారు. ఇప్పుడు పైరవీలు, ముడుపులు లేకుండానే పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. ‘మద్యం అమ్మకాలు తగ్గితే బీఆర్‌ఎస్‌కు వచ్చిన నష్టమేంటీ..?  మద్యం అమ్మకాలు తగ్గితే ప్రజలకు ఏమైనా నష్టం ఉందా..?. రాష్ట్రంలో మద్యం తాగే వాళ్ల సంఖ్యను  పెంచాలని కోరుకుంటున్నారా..?  బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీశారు.

ప్రభుత్వ పాలసీలు ఏమైనా ఉంటే.. అవి క్యాబినెట్‌లో నిర్ణయాలు జరుగుతాయని,  మద్యం కొత్తపాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి  తెలిపారు. టానిక్ మద్యం దుకాణాలకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపును తమ ప్రభుత్వం రద్దు చేసిందని మంత్రి పేర్కొన్నారు.  వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీకి మధ్య తేడా ఉందన్నారు.  గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బకాయిలు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. జూపల్లి మంత్రిగా ఉన్న శాఖలో అవకతవకలు, అవినీతి అనేది ఉండదన్నారు. తమ ప్రభుత్వ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందన్నారు.

రూ. 10 వేల కోట్ల నుంచి రూ. 34 వేల కోట్లకు తీసుకెళ్లారు.. 

లిక్కర్ వ్యాపారాన్ని రూ. 10 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు తీసుకెళ్లిందే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమని మంత్రి జూపల్లి మండిపడ్డారు. అన్ని బ్రాండ్లకు సంబంధించి గత ప్రభుత్వం అక్టోబర్ నుంచే బిల్లులు సుమారు రూ. 2,350 కోట్లు పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి గత ప్రభుత్వం రూ. 40 వేల కోట్లను బకాయి పెట్టిందని, ఒక లిక్కర్‌కే రూ. 2,350 కోట్లను చెల్లించామని మంత్రి వివరించారు.