ప్రభాస్‌తో సినిమా చేయడం రోమాంచకం మూవ్‌మెంట్
సందీప్‌రెడ్డి వంగా
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న తాజాచిత్రం ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత. నూతన దర్శకుడు వేణుగోపాల్‌రెడ్డి దీన్ని ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఓ ఆసక్తికరమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.
ఇందులో ఉపేంద్ర లిమయె, వెంకటేశ్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రలో విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ.. “ఈ కథ విన్నప్పుడు నేను ఎంతగా నవ్వుకున్నానో, సినిమా చూశాక అంతకంటే ఎక్కువ నవ్వాను. ఫస్ట్ టైమ్ మా బ్యానర్ సినిమాకు క్లీన్ యూ బై ఏ సెన్సార్ సర్టిఫికెట్ వస్తోంది. అన్నీ ఎ సర్టిఫికెట్‌లు వచ్చేవి. రాబోయే ‘స్పిరిట్’కూ ఎ సర్టిఫికెటే వస్తుంది.
ఎన్నిసార్లు మేము ఫ్యామిలీస్‌తో మా సినిమాకు రావాలని చెప్పినా ప్రేక్షకులు రాలేదు. ఈ సినిమాకు ఫ్యామిలీతో పాటు రండి. ఇలాంటి స్క్రిప్ట్ నేను రాయలేను. సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఈ రోజుల్లో స్క్రిప్ట్ రాయడం కష్టం. కానీ ఈ సినిమాకు ఆ సినిమాటిక్ అడ్వాంటేజ్ చాలా తక్కువ తీసుకున్నారు. ప్రభాస్ అన్నతో సినిమా చేయడమే నా జీవితంలో ‘రోమాంచకం’ మూవ్‌మెంట్” అన్నారు.
హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ-.. “రోమాంచకం’ క్యూట్ లవ్ ఫిలిం. భద్రకాళీ పిక్చర్స్‌లో వస్తున్న ఫన్ క్యూట్ ఎంటర్‌టైనర్ ఇది. ఎవర్ని సినిమాకు తీసుకువెళ్లినా డిజప్పాయింట్ కారు. ఆ కాన్ఫిడెంట్ తో సినిమాకు వెళ్లండి” అన్నారు. హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ మాట్లాడుతూ.. “మా సినిమా చూసి ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. మా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ఏంటో ఫీల్ కావాలంటే సెప్టెంబర్ 3న మా మూవీ చూసేందుకు థియేటర్స్‌కు రండి” అని తెలిపింది.
నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “ఈ సినిమా విజయం మా భద్రకాళీ సంస్థ కంటే వాళ్లకు ఎక్కువ అవసరం. ఈ సినిమా విజయంతో మా డైరెక్టర్ వేణు, మా హీరో, మా హీరోయిన్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు పేరు రావాలి. వీళ్లంతా దాదాపు కొత్త వాళ్లే, రెండు మూడు సినిమాలు చేసినవాళ్లే. వాళ్లకు ‘రోమాంచకం’ సినిమా సక్సెస్‌తో గుర్తింపు వచ్చి, మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నా” అని తెలిపారు. చిత్ర దర్శకుడు వేణుగోపాల్‌రెడ్డి, నటుడు వెంకటేశ్ కాకుమాను, డీవోపీ పవన్ పప్పుల, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్, కాస్ట్యూమ్ డిజైనర్ కీర్తన కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.






