calender_icon.png 2 February, 2026 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునగ చెట్టు ఆమెకు కల్పతరువు

16-02-2025 12:00:00 AM

ఆమె పదో తరగతి డ్రాప్‌ఔట్.. పైగా నలుగురు పిల్లల తల్లి.. తన పరిస్థితి ఇంతేనా? అని ఇంటికే పరిమితం కాలేదు. వంటిల్లు దాటి అవకాశాలను అన్వేషించింది. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టుగా.. మునగ సాగు చేయాలనే ఆమె ఆలోచన ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చేసింది. ఇతరులకు భిన్నంగా సాగు చేసి లక్షల్లో ఆదాయం రాబడుతోంది తమిళనాడుకు చెందిన పొన్నరసి. మోరింగతో జీవితాన్నే మార్చుకున్న ఆమె స్ఫూర్తిమంతమైన ప్రయాణం గురించి...

పొన్నరసిది తమిళనాడులోని కోయంబత్తూర్. వ్యవసాయంతో ముడిపడి ఉన్న కుటుంబం ఆమెది. బాల్యమంతా పొలాల మధ్యే గడిపింది. వ్యవసాయంలో శ్రమ, అంకితభావం ఎంతో అవసరమని చిన్నప్పుడే అర్థం చేసుకుంది. మునగ చెట్లే మధ్య పెరిగిన ఆమెకు అదే విజయాన్నిస్తుందని ఊహించలేదు. పదేళ్ల క్రితమే వ్యవసా యంలోకి అడుగుపెట్టి మునగ సాగుకు శ్రీకారం చుట్టింది.

కుటుంబానికి పది ఎకరాల భూమి ఉండటంతో మునగ సాగు చేసి ఆకులు, విత్తనాలు, వేర్లను అమ్మింది. అయితే మార్కెట్‌లో ధరలు తగ్గడం, మునగ విత్తనాలు కొన్నిసార్లు తక్కువ ధరకు అమ్ముడుపోవడంతో నష్టపోయింది. ఎంతోకాలం సాగు చేస్తున్నా  కనీస పెట్టుబడులు కూడా చేతికంద లేదు. అయితే సాగులో కొత్త విధానం అవసరమని నమ్మి ఆ దిశగా అడుగులు వేసింది. 

టర్నింగ్ పాయింట్

ఓసారి కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ కళాశాలకు వెళ్లింది. అక్కడ వ్యవసాయ నిపుణుడు జాన్ కెన్నెడీని పరిచయం ఏర్పడింది. అయితే చాలామంది రైతులు తమ పంట సామర్థ్యాన్ని పెంచడం కోసమే సాగు చేస్తున్నారని, సాధారణ పద్ధతిలోనే సాగు కొనసాగి స్తున్నారని తెలుసుకుంది. ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకుంది పొన్నరసి.

వ్యవసాయ శిక్షణా తరగతులకు హాజరైంది. అక్కడ ఆమె మునగ ఉత్పత్తి గురించి తెలుసుకుంది. ఆమె పట్టుదల కృషి విజ్ఞాన కేంద్రం అధికారుల దృష్టిని ఆకర్షించింది. పొన్నరసి కరువును తట్టుకునే మూలనూర్ రకం మునగను పండించడం మొదలుపెట్టింది.

కొత్త కొత్త పద్ధతుల తో సాగు చేయడంతో ఏటా ఎకరానికి మూడు టన్నుల దిగుబడిని సాధించింది. మునగను నూనెగా మార్చి లాభాలు రాబట్టింది. లీటరుకు రూ. 5,000 చొప్పున మునగ నూనె అమ్మి తిరుగులేని వ్యాపారం చేసింది. ఆమె తయారుచేసిన నూనె సౌందర్య సాధనాలు, ఆహారం, ఔషధాలలో ఉపయోగిస్తున్నారు కూడా. 

తమిళనాడు నుంచి విదేశాలకు 

పొన్నరసి ప్రస్తుతం మునగతో 36 ఉత్పత్తులను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది. మోరింగ నూనె, పౌడర్ నుండి సబ్బులు, షాంపూలు, లిప్ బామ్‌లు, సూప్ పౌడర్ల వరకు.. ఇలా అనేక ఉత్పత్తులు తయారుచేస్తూ ఊహించని లాభాలు అందుకుంటోంది.

మలేషియా, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, మస్కట్ లాంటి దేశాల్లో సైతం పొన్నరసి ప్రొడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. కస్టమర్ల అవసరాలను తీర్చడానికి నిరంతరం ఆవిష్కరణలు చేయడంతో ఎక్కువ లాభాలు వచ్చాయి. ఏడాదికి ఏకంగా రూ.12 లక్షల టర్నోవర్ సాధించింది.

ఈ క్రమంలో బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం పొన్నరసి అంటే చాలామందికి తెలియకపోవచ్చేమోకానీ.. ‘ది మోరింగ క్వీన్’ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు ఎవరైనా. మునగతో జీవితాన్ని మార్చుకున్న పొన్నరసి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలవడం నిజంగా స్ఫూర్తిదాయకమే. 

లక్షల్లో ఫాలోవర్లు

ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే మార్కెటింగ్ స్కిల్స్ కూడా తెలిసి ఉండాలి. అయితే పొన్నరసి పెద్దగా చదువుకోలేదు. పదో తరగతిలోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టింది. దాంతో కూతురే ఆన్‌లైన్ మార్కెటింగ్ చేసింది.

ఆ తర్వాత టెక్నాలజీ పట్టు సాధించి ఆన్‌లైన్‌లోనూ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంది. ప్రస్తు తం ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా లక్షకుపైగా ఫాలోవర్లున్నారు. ‘ఫేస్‌బుక్ నా ఉత్పత్తులను మార్కెట్ చేయడంలో సహాయపడటమే కాకుండా అంతర్జాతీయ ఆర్డర్లను కూడా సులభతరం చేసింది’ అని అంటోందీమే.