16-02-2025 12:00:00 AM
నేడు చాలా మంది వివిధ కారణాలతో ‘నేను ఒంటరిని’ అనే భావనలో ఉండిపోతున్నారు. ఈ పరిస్థితి మరింత ముదిరితే.. డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇందులోనుంచి బయట పడేందుకు పలు సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
ప్రతిఒక్కరికీ చాలామంది పరిచయస్తులు ఉంటారు. వారిలో మనసు కు దగ్గరగా వచ్చినవారిని గుర్తించాలి. మనసులోని భావాలను వారితో పంచుకోగలమనే దీమా ఉండాలి. అటువంటివారితో ఎక్కువగా మాట్లాడుతూ స్నేహం పెంచుకోవాలి. వారితో కష్ట సుఖాలు చెప్పుకోవడం, వారి నుంచి సలహాలు తీసుకోవడం, వారికి అవసరమైన సలహాలు ఇవ్వడం చే స్తూ ఉంటే మనసులో ఒంటరితనమనే భావన రాదు.
ప్రశంసించుకోండి: ఒంటరిగా ఉండేవాళ్లు నాకు ఏమీ రాడు, ఏమీ చేయలేను అనుకుంటూ బాధపడుతుంటారు. ఇలా తమను తాము కించపరచుకో వడం వల్ల మానసిక వేదన అధికమవుతుంది. అలాకాకుండా మీ ఆలోచనలను ఒక పుస్తకంలో రాయండి. మీలో మీరు మాట్లాడుకోండి. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. ఇలా చేయడంవల్ల మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది.
అతి వద్దు: ఒంటరిగా ఉండేవాళ్లు సహజంగా ఎదుటివారి నుంచి గుర్తింపు కోరుకుంటారు. దీంతో చుట్టూ ఉన్నవాళ్లను పరిశీలిస్తూ వారికి అవసరమైనదానికంటే ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు.
అలాగే వారినుంచి ప్రశంసలు, గుర్తింపు ఆశిస్తారు. ఇవి అందని పక్షంలో మనసులో వెలితి భావనలు మొదలై బాధపడుతుంటారు. అలాకాకుండా ఎవరైనా సహాయం అడిగినపుడు మాత్రమే కాదనకుండా చేయాలి అతి మంచితనం ప్రదర్శించాలని అనుకోకూడదు.
హోదా ప్రదర్శించవద్దు: సమాజంలో మంచి హోదాలో ఉంటేనే గుర్తింపు లభిస్తుందనుకుంటారు కొంతమంది. ఇది నిజం కాదు. మంచి వ్యక్తిత్వం, ఆకర్షణీయమైన ప్రవర్తన, అందరినీ కలుపుకొనే మృదు స్వభావంవల్లనే ఒంటరితనం అనే భావన దూరమవుతుంది.
ఇరుగు-పొరుగువారితో: నిరంతరం ఉత్సాహంగా ఉండాలనే భావన ఒంటరితనాన్ని దగ్గరికి రానీయదు. కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడడం, స్నేహితులతో సరదాగా గడిపే ప్రయత్నం చేయడం, ఇరుగు-పొరుగువారితో ఆటలు ఆడడం, కలిసి పంటలు చేయడం. వంటివి మనసుని సంతోషంతో నింపేస్తాయి. క్రమంగా బంధాలు కూడా బలపడతాయి.
ఇష్టమైన వ్యాపకాలు
మీలో మీరు వచ్చిన పని చేయడం, నచ్చిన వ్యక్తులతో గడపడం అలవాటు చేసుకుంటే మనసు సేదతీరుతుంది. ఎక్కువసేపు ఖాళీగా ఉండకుండా ఏదైనా వ్యా పకంలో నిమగ్నమైతే ఆత్మన్యూనత భావనలు దరిచేరవు.
చదవడం, బొమ్మలు వేయడం, తోటపని, పిల్లలతో గడపడం, సంగీతం వినడంవల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. తేలికపాటి వ్యాయా మం, యోగా, ధ్యానంవల్ల మానసిక ఆందోళన తగ్గి ఒంటరితనం అనే భావనే ఉండదు.