నూతన ఈ ప్రొక్యూర్‌మెంట్‌ను నిలిపివేయాలి
డీపీసీ పరిధిలోనే కొనుగోలుకు వెసులుబాటు కల్పించాలి
చిన్న సప్లయర్ల ఉపాధిని కాపాడాలి
తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్స్ అసోసియేషన్
పంజాగుట్ట, మే27 (విజయక్రాంతి): గురుకులాలకు సరుకుల సరఫరా కోసం చేపట్టిన నూతన ఈ-ప్రొక్యూర్మెంట్ ను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నూతన ప్రొక్యూర్మెంట్ విధానంలోని నిబంధనల కారణంగా తెలంగాణలోని చిన్న సప్లయర్లు నష్టపోతారని పేర్కొంది.
ఈ విషమైన అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లెపల్లి నర్సింగ రావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, జీఓ 17 వివాదం ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు.
జీఓ 17 ద్వారా కిరాణ, కూరగాయలు, చికెన్, మటన్ సరఫరా, క్యాటరింగ్ సర్వీసులకు భారీ టర్నోవర్, కోట్లల్లో దరఖాస్తు రుసుము, సెక్యూరిటీ డిపాజిట్ నిబంధనలు విధించడంతో కాంట్రాక్టర్ల సంఘం 2025 అక్టోబరులో హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. సగటు మనిషి జీవనోపాధిని దెబ్బతీయకుండా నిబంధనలను రెండు శాతానికి మించకుండా ఉండేలా చూడాలని, స్థానికులకు 25 శాతం ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలను కోర్టు సూచించిన విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు కేసు పెండింగ్ ఉండగానే నూతన ప్రొక్యూర్మెంట్ ను ప్రభుత్వం చేపట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని సుమారు 4 వేల గురుకులాలు, హాస్టళ్లకు నిత్యావసర సరుకులు, క్లీనింగ్ మెటీరియల్స్ సరఫరా కోసం టెండర్లు జాతీయ స్థాయిలో పిలిచారన్నారు. సరఫరా సంస్థలకు గత మూడేళ్లలో రూ.500ల కోట్ల టర్నోవర్ ఉండాలని, రూ.200 కోట్ల బ్యాంక్ గ్యారంటీ లేదా సాల్వెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని, రూ.16 కోట్ల దరఖాస్తు రుసుముతో పాటు రూ.15 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని, కోల్ స్టోరేజ్ తో పాటు సొంత రవాణ వాహనాల సర్టిఫికెట్లు ఉండాలనే నిబంధనలను రూపొందించారని వివరించారు.
ఈ నిబంధనలు కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా ఉన్నాయని ఆరోపించారు. తద్వారా స్థానిక సప్లయర్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్త పెద్ద టెండర్ అయినప్పటికీ, స్థానిక చిన్న కాంట్రాక్టర్లను నిలువరించడానికే ఇంత హుటాహుటిన, హడావుడిగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మే నెలలో జరిగిన ప్రీ-బిడ్ మీటింగ్కు మిగతా ఐదు సంస్థల సెక్రటరీలు కూడా హాజరుకాలేదన్నారు.
అది మొక్కుబడిగా జరిగిందని తెలిపారు. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ద్వారా విడుదల చేసిన ఈ నూతన టెండర్ ప్రొక్యూర్మెంట్ను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కూరగాయలు, చికెన్, మటన్ లాగే కిరాణా సరుకులను కూడా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ పరిధిలోనే కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించి తెలంగాణలోని స్థానిక నిరుద్యోగ యువతకు, చిన్న సప్లయర్లకు ఉపాధి కాపాడాలని విన్నవించారు. ఈ సమావేశంలో తెలంగాణ గురుకుల అసోసియేషన్ నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, హరిప్రసాద్, నవీన్, వెంకటేశ్, రమేశ్ పాల్గొన్నారు.






