28 May, 2026 | 2:16 AM

కల్లాల్లో కన్నీరు

28-05-2026 01:18 AM

అకాల వర్షానికి తడిసిన ధాన్యం, మక్కలు

తడిసిన ధాన్యం కొనాలని రైతుల ఆందోళనలు 

కొనుగోళ్లలో జాప్యం వల్లే నష్టపోయామని ఆవేదన

కరీంనగర్/మెదక్/సిరిసిల్ల/కామారెడ్డి/సంగారెడ్డి/నాగర్‌కర్నూల్/సిద్దిపేట/కొల్లాపూర్, మే 27 (విజయక్రాంతి)/గుమ్మడిదల/సుల్తానాబాద్/కోరుట్ల: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వర కూ గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోహి ణి కార్తె ప్రారంభమైన తరుణంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.

గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. కొనుగో లు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన, కల్లాల్లోని ధాన్యం కుప్పలు, వడ్ల బస్తాలు తడి ముద్దయ్యాయి. కళ్లముందే కష్టం నీటిపాలు కావ డంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. కొనుగోళ్లలో జాప్యం వల్లే ధాన్యం తడిసిందని, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. 

ఉమ్మడి మెదక్ జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో మంగళవారం అర్ధరా త్రి కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు అతలాకుతలం అయ్యారు. జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గ పరిధిలో అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నీట మునిగింది.   తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని గుమ్మడిదల బాలానగర్ ప్రధాన రహదారి టోల్గేట్ వద్ద రైతులు, ప్రజా ప్రతినిధులు రాస్తారోకో నిర్వహించారు.

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో పెంకుటిల్లు పూర్తిగా ధ్వంసమైంది. చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్, నంగునూరు, బెజ్జెంకి, చిన్నకోడూరు, కుకునూరుపల్లి, చేర్యా ల మండలాల్లో రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేశా రు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.  నంగునూరు మండలం తిమ్మయపల్లి గ్రామం లో పశువుల పాక కూలిపోయింది. చేర్యాల మార్కెట్ యార్డులో వడ్లు, మక్కలు తడిశాయి. 

సిరిసిల్ల జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఎల్లా రెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన వరి ధాన్యం తడిసింది. గాలివానకు టార్పాలిన్ కవర్లు ఎగిరి పోవడంతో కల్లాల్లో ఉన్న ధాన్యం నీటిపాలైంది. ఎల్లారెడ్డిపేటలో తూకం వేసి సిద్ధంగా ఉంచిన బస్తాలు సైతం తడవగా, వీర్నపల్లి మండలం అడవిపదిరలో వందలాది బస్తాలు వర్షానికి నానిపోయాయి. రెండు నెలలుగా గన్నీ సంచుల కొరత కారణంగా కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం కొనాలని ముస్తాబాద్‌లో రైతులు రాస్తారోకో చేశారు.

కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేం ద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యా న్ని తెచ్చిన వెంటనే అధికారులు కొనుగోలు చేపడితే తమకు నష్టం జరిగేది కాదని రైతులు తెలిపారు.సదాశివనగర్, తాడువాయి, గాంధా రి మండల కేంద్రాల్లో మక్కలు కూడా వర్షానికి తడిసిపోయాయి. తడిసిన ధాన్యం కొనా లని మాచారెడ్డి మండల కేంద్రంలో కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.

నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డి వద్ద మెదక్ రహదారిపై రైతు లు తడిసిన ధాన్యం సంచులను పెట్టి నిరసన వ్యక్తం చేశారు. తాము ధాన్యాన్ని తెచ్చి 30 రోజులు అవుతున్న సకాలంలో అధికారులు కాంట పెట్టకపోవడం, కొన్న ధాన్యం తరలించకపోవడం వల్ల అకాల వర్షానికి తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేరుకొని రైతులకు సముదాయించారు. 

నాగర్‌కర్నూల్ జిల్లాలో..

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈదురు గాలుల తో కూడిన భారీ వర్షం కురవడంతో ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. కొంత ధాన్యం వర్షపు నీటిలో కాలువల్లో కొట్టుకుపోయింది. 

వాగులో చిక్కుకున్న వ్యక్తి

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని ప్యారవరం గ్రామంలోని వాగులో ఓ వ్యక్తి చిక్కుకోవడంతో గ్రామస్తులు కాపాడారు. బీహార్‌కు చెందిన తులసీరాం అనే వ్యక్తి బుధవారం తెల్లవారు జామున సమీప వాగులోకి కాలకృత్యాలకు వెళ్లాడు. ఒక్కసారిగా వాగులో నీటి ప్రవాహం పెరగడంతో మధ్యలో ఓ బండరాయిపై చిక్కుకుపోయాడు. గమనించిన గ్రామస్తులు తాడు, నిచ్చెన సహాయంతో అతన్ని కాపాడారు. 

విరిగిపడిన చెట్లు, ధ్వంసమైన ఇళ్లు

జగిత్యాల, పెద్దపెల్లి, మంచిర్యాల, వేములవాడ ప్రధాన రహదారుల వెంట ఫ్లెక్సీలు తీగలపై పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి గంటలపాటు  చీకట్లు కమ్ముకున్నాయి. సవరన్ స్ట్రీట్లో ఓ ఎల్టీ స్తంభం విరిగి విద్యుత్ తీగలు తెగిపోయాయి. బొమ్మకల్ ప్రాంతంలో 11 కేవీ స్తంభాలు విరిగిపోవడంతో లైన్లు దెబ్బతిన్నాయి. కలెక్టరేట్ ఆవరణలో ఓ చెట్టు విరిగి పడడంతో తీగలు తెగిపోయాయి. కరీంనగర్ బొమ్మకల్ 5వ వార్డులోని వడ్డెర కాలనీలో ఇండ్లు కూలాయి.

కేంద్ర మంత్రి బండి సంజయ్ వడ్డెర కాలనీని సందర్శించారు. కూలిన ఇల్లు నిర్మాణానికి తక్షణ ఆర్ధిక సాయం అందిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. గండికోట రాజేశ్ కుటుంబాన్ని ఆదుకుంటామని హిమీ ఇచ్చారు. మానకొండూరు సెక్షన్ పరిధిలోనీ  వెల్ది, లక్ష్మిపూర్, రంగపేట, ఊటూరు, లింగాపూర్, జగ్గయ్యపల్లి మరియు వేగురుపల్లి గ్రామాలలో 58 విద్యుత్ స్తంభాలు, ఎల్ టి లైన్లో 33 పోల్స్, 20 ట్రాన్స్ఫార్మర్స్ నేలమట్టం అయ్యాయి.

చెంజర్ల సబ్ స్టేషన్ పరిధిలో మూడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. మూడు స్తంభాలు విరిగిపోయాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నీరుకుల్లా పాల డైరీ వద్ద చెట్టు విరిగి రెండు ఆటోలు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగి కింద పడ్డాయి. పలుచోట్ల ఇళ్లపై రేకులు లేచిపోయాయి. జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడెం గ్రామంలో ఫౌల్ట్రీ ఫామ్ షెడ్డు ఎగిరి, 300 కోళ్లు మృతిచెందాయి. ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి.