02-08-2025 01:15:17 AM
ఫేస్ యాప్ అటెండెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేసిన గ్రామ కార్యదర్శి
జగిత్యాల అర్బన్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ను డైలీ అటెండెన్స్ యాప్‌లో అప్లోడ్ చేసి అడ్డంగా బుక్ అయ్యాడు ఓ గ్రామ కార్యదర్శి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ కార్యదర్శులకు డేలీ సానిటేషన్ రిపోర్ట్ (డి ఎస్ ఆర్) యాప్ లో ముఖ చిత్రంతో పాటు హాజరు నమోదుపరచాలని ఉత్తర్వులు జారీ చేయగా ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహించిన గ్రామ కార్యదర్శి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో యాప్ లో అటెండెన్స్ వేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్యపల్లి గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 43(ii) లోని (ఎ) నియమాల ప్రకారము ప్రతీ పంచాయతీ కార్యదర్శి ప్రతి రోజూ గ్రామ పంచాయతీలలో సరియైన పారిశుద్ధ్యమును పర్యవేక్షించడానికి ప్రతి రోజూ ఉదయం 7 గం.ల లోపు హాజరై గ్రామ పంచాయతీలో తిరగాలని పంచాయతీరాజ్ కమీషనర్ నూతన డిఎస్‌ఆర్ యాప్ ని ప్రవేశ పెట్టారు. పంచాయతీ కార్యదర్శులు నిర్దేశించిన ఆదేశాల ప్రకారం వారి గ్రామ పంచాయతీ భవన పరిసర రిజిస్టర్ అయిన జియో కొ-ఆర్డినేట్స్ లొకేషన్లో ప్రతీ రోజు డిఎస్‌ఆర్ యాప్ లో ముఖ చిత్రంతో పాటు హాజరు నమోదు చేయవలసి ఉంటుంది.
అయితే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ చందయ్యపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి టీ.రాజన్న లైవ్ ఫోటో కాకుండా క్యాప్చర్ ఫోటోతో అటెండెన్స్ వేసుకున్నట్లు తేలింది. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ వేసుకున్నట్లు తేలడంతో విచారణ జరిపిన జిల్లా పంచాయతీ అధికారి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. పంచాయతీ అధికారి నివేదిక ప్రకారం రాజన్నను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.