27-11-2025 04:55:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం లక్ష్మణచందా మండలంలోని వడ్యాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని పంచాయితీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా పరిశీలకులు, కలెక్టర్ ఇక్కడ ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. పరిశీలకు మాట్లాడుతూ, హెల్ప్ డెస్క్ లో సిబ్బంది అందుబాటులో ఉంటూ, అభ్యర్థులకు సమాచారం ఇవ్వడంలో సహాయపడాలన్నారు. అధికారులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలని వివరించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, తహసిల్దార్ సరిత, ఎంపీడీవో రాధా రాథోడ్, ఎన్నికల అధికారులు, సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.