27-11-2025 05:55:15 PM
పేదవర్గాలను పోరాటాలవైపు నడిపిన పోటు ప్రసాద్.
అమరనేతల త్యాగాలను, సేవలను మర్చిపోవద్దు.
పోటు ప్రసాద్ ఆశయాల సాధనే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలి
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం..
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): పేద ప్రజలు, కార్మికులో మమేకమై తన తుదిశ్వాస వరకు వారి అభ్యున్నతి కోసం శ్రమించిన పోటు ప్రసాద్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం అన్నారు. సీపీఐ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు ఖమ్మం జిల్లా మాజీ కార్యదర్శి పోటు ప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో వర్ధంతి సభ నిర్వహించారు. తొలుత పోటు ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ది నాయకుడిగా, కార్మిక సంఘం నాయకుడిగా పేద ప్రజలను మమేకం చేసి పోరాటాల వైపు నడిపిన వ్యక్తి ప్రసాద్ అని ఆయన సేవలను కొనియాడారు.
తుదిశ్వాసవరకు ప్రజలకోసం పనిచేసిన నేతలే త్యాగాలను, సేవలను నేటి తరం మర్చిపోకుండా ఆదర్శంగా తీసుకొని పేద ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. స్వార్థప్రయోజనాల కోసం జెండాలు, ఎజెండాలు మారుస్తూ రాజకీయాలను మలినం చేస్తున్న ప్రస్తుత తరుణంలో అందుకు భిన్నంగా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి కడదాకా ఒకే జెండాతో మమేకమైన నికార్సయిన కమ్యూనిస్టు, అలుపెరగని పోరాట యోధుడి పోటు ప్రసాద్ అని అన్నారు.
ప్రసాద్ మృతి కమ్యూనిస్టు పార్టీ కి తీరనిలోటు అని, అయినా ఆశయాలు సాధించిన నాడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారవుతామని, పోటు ప్రసాద్ ఆశించిన విధంగా కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపితం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, జిల్లా సమితి సభ్యులు అన్నారపు వెంకటేశ్వర్లు, వరక అజిత్, నాయకులు డి చెన్నయ్య, గిరి, అనుముల సాయి, దామెరెడ్డి క్రాంతి, ఇరుకు రామారావు, సంజీవరావు, రామాచారి, ఆదినారాయణ, అశోక్, రామారావు, కోమటి శ్రీను, అల్లీ వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, లాల్ పాషా తదితరులు పాల్గొన్నారు.