రామప్ప చెరువు నీటిపై ప్రతిపక్షాల చిల్లర రాజకీయాలు మానుకోవాలి
రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి
వెంకటాపూర్, జూలై 21 (విజయక్రాంతి): రామప్ప చెరువు నీటి విడుదల అంశంపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామప్ప చెరువులో నీటిని నిల్వ ఉంచినట్లు, రైతులకు అన్యాయం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని,
గత ప్రభుత్వాల మాదిరిగా రైతులను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. మంత్రి సీతక్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇప్పటికే మాట్లాడినట్లు, ప్రభుత్వం నుంచి మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఎప్పటిలాగే రైతుల అవసరాలకు అనుగుణంగా రామప్ప చెరువు నుంచి నీటిని విడుదల చేస్తామని, రైతుల పేరుతో మొసలి కన్నీరు కారుస్తూ ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదని,
రామప్ప చెరువు నీటి అంశంపై చిల్లర రాజకీయాలకు స్వస్తి పలకాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సూర్యనారాయణ, రామప్ప ఆలయ కమిటీ చైర్మన్ ఐలయ్య, ఎన్‌ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కోటి, గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపసర్పంచ్ రాజు, మైనారిటీ మండల జాకీర్, ఆత్మ డైరెక్టర్ రవి, పోషాలు, చంద్రాకర్ రెడ్డి, రాజయ్య, ప్రమోద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.






