26 April, 2026 | 2:22 AM

అంతిమ నిర్ణేతలు ప్రజలే!

26-04-2026 12:00 AM

డా. తిరునహరి శేషు :

ప్రజాస్వామ్యంలో నాయకులను, పార్టీలను గెలిపించేది, ఓడించేది ప్రజలే. అందుకే ప్రజలను అంతిమ నిర్ణేతలు గా భావిస్తారు. దేశంలో అత్యంత బలమైన నేతలను, పార్టీలను ఓడించిన చరిత్ర కూడా ప్రజలదే. ‘మేము ఓటమికి అతీతులం. మమ్మల్ని ఓడించే శక్తి ఎవరికీ లేదు’ అని ఏ నాయకుడైనా భావిస్తే అతడిని ప్రజల నుంచి ఎదిగిన నాయకుడిగా కాకుండా ఎత్తుగడ లతో ఎదిగిన నాయకుడిగానే భావించాలి.

దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా ఎదిగిన ఇందిరాగాంధీ, తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎన్టీ రామారావు లాంటి వారే ప్రజాక్షేత్రంలో ఓడిపోక తప్పలేదు. ఇప్పటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ప్రజల చేతిలో ఓటమిపాలైన వారే. తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటయ్యాక ఒక దశా బ్దం పాటు రాష్ట్ర రాజకీయాలలో తిరుగు లేని శక్తిగా ఎదిగిన బీఆర్‌ఎస్‌కి 2023 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓటమి ఎదురైంది.

అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నిత్యం సవాళ్లు, ప్రతి సవాళ్లతో అత్యంత సంక్లిష్టంగా మారాయి. అధికారం నిలబె ట్టుకోవాలని ఒకరు, పోయిన అధికారాన్ని దక్కించుకోవాలని మరొకరు, ఎలాగైనా అధికారం సాధించాలని ఇంకొకరు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే రాష్ట్రంలో రాజకీ యాలు తప్ప మరేమీ కనిపించటం లేదంటే అతిశయోక్తి కాదు.

ఇటీవల 40 సంవత్స రాల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల ఒక రాజకీయ నాయకుడు పార్టీ మారే సంద ర్భంలో ఇచ్చిన నినాదం రాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ‘రేవంత్ పోవాలి- కేసీఆర్ రావాలి’ అనే నినాదం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్లినట్లు గానే కనిపిస్తోంది. అందుకే ‘ప్రజాపాలన పో వాలా! పాపాల భైరవుడు రావాలా!’ అనే ఘాటైన స్పందన ముఖ్యమంత్రి నుంచి కూ డా వచ్చింది.

2023 తెలంగాణ రాష్ట్ర శాస నసభ ఎన్నికల సందర్భంగా ‘మార్పు కావా లి- - కాంగ్రెస్ రావాలి’ అనే నినాదం రాష్ట్రం లో కాంగ్రెస్ గతినే మార్చివేసింది. కాబట్టి ‘రేవంత్ పోవాలి- -కేసీఆర్ రావాలి’ అనే నినాదానికి కూడా ఆ స్థాయిలో స్పందన వస్తే, అది రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపించక మానదనే అభిప్రాయం రా జకీయ వర్గాలలో వ్యక్తమవుతోంది.

 ఎందుకు ఓడిపోవాలి!

ప్రజా మద్దతు ఉన్నంతకాలం పార్టీలు, నాయకులు అధికారంలో కొనసాగుతారు. కానీ, ప్రతిపక్ష పార్టీలు, నాయకులు కోరుకు న్నంత మాత్రాన అధికారం నుంచి వైదొలిగే పరిస్థితి ఉత్పన్నం కాదు. ప్రజా మద్దతుతోనే నెహ్రూ అత్యధిక కాలం 17 సంవత్సరాలు ప్రధానిగా, పవన్ కుమార్ చామ్లింగ్ 25 సంవత్సరాలు సిక్కిం ముఖ్యమంత్రిగా కొన సాగారు. నరేంద్ర మోదీ 8,931 రోజులకు పైగా అధికారిక పదవులలో కొనసాగుతున్నారు.

ఏ నాయకుడైనా, పార్టీ అయినా అధి కారంలోకి రావడానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, అధికా రంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆకాంక్షల మేరకు పాలన అందించకపోతే ఆ పార్టీ, ఆ నాయకుడు అధికారం నుంచి దిగిపోవాలనే నినాదానికి ప్రజా మద్దతు దొరుకుతుంది. రేవంత్‌రెడ్డి ఓడిపోవాలనే నినాదాన్ని జీవన్ రెడ్డి తన వ్యక్తిగత రాజకీయ అవసరం కోస మో, ఆకాంక్ష కోసమో అయితే ఆ నినా దానికి ప్రజా మద్దతు లభించదు. 

తెలంగాణ రాష్ట్రంలో 29 నెలలుగా రేవం త్‌రెడ్డి పాలన రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సం క్షేమం, హామీల అమలు దిశగా కొనసాగితే రేవంత్‌రెడ్డి ఓడిపోవాలనే నినాదాన్ని ప్రజ లు పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండదు. కానీ చాలా ప్రభుత్వాలు ముఖ్యంగా, కాం గ్రెస్ పాలిత రాష్ట్రాలు జనరంజకమైన పాలన అందించడంలో విఫలమవుతున్నా యి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

గ్యారెంటీలు, హామీల అమలు పట్ల ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవు తోంది. ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, ఇతర రాష్ట్రాలలో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తుంటే ఇక్కడ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు, ఇప్పటి వరకు అమలు చేయని మహాలక్ష్మి, పెన్షన్లు, తులం బంగారం, మహి ళలకి స్కూటీల కంటే తక్కువగా కనపడ టంతో ప్రభుత్వంపై ప్రజలలో సానుకూలత వ్యక్తం కావడం లేదు. 

రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కీలకమై న రెవెన్యూ, ఆర్థిక శాఖల వైఫల్యం, ముఖ్య మంత్రి నిర్వహిస్తున్న హోంశాఖ, విద్యాశాఖ, పురపాలక శాఖ లాంటి కీలక శాఖల ప్రద ర్శన పేలవంగా ఉండటం, ఆ శాఖలను నిర్వ హించే సమర్థులే లేరనే సంకేతం ప్రజలలో కి వెళ్లడం, మంత్రివర్గంలో కీలకమైన యాదవ, లంబాడ సామాజికవర్గాలకు ప్రాతిని ధ్యం లేకపోవడం, మంత్రివర్గంలోని ముఖ్య మైన వ్యక్తులపై అవినీతి ఆరోపణలు, ప్రభు త్వ ఉద్యోగాల భర్తీలో గత ప్రభుత్వంలాగే వ్యవహరించటం, విపరీతంగా అప్పులు చేయటం లాంటి అంశాలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.

‘2034 వరకు మే మే అధికారంలో ఉంటామ’ని ముఖ్యమంత్రి చెప్పే తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల రెండు పర్యాయాల థియరీలో ఏ ప్రామాణికత లేదు. ‘రేవంత్ రెడ్డి ఓడి పోవాలి’ అనే నినాదాన్ని జీవన్ రెడ్డి ప్రజా బాహుళ్యంలోకి తెచ్చినప్పుడు ఆ నినాదానికి సానుకూలత ఎంతనేది పక్కనపెడితే, ప్రజల నుంచి వ్యతిరేకత మాత్రం రాలేదు. 

మళ్లీ ఎందుకు రావాలి? 

ఒక దశాబ్దం పాటు అధికారంలో ఉండ టం వలన ప్రభుత్వంపై ఏర్పడిన సహజ ప్రజా వ్యతిరేకత, నాటి పాలకుల అహంకా రపూరిత వైఖరి, రాష్ట్ర ఉద్యమ ప్రధాన లక్ష్యమైన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిర్ల క్ష్యంగా వ్యవహరించటంతో బీఆర్‌ఎస్ అనూ హ్యంగా ఓటమిపాలైంది. రాజకీయాలలో గెలుపోటములు సహజం. ఓటమి ఎదురైన పార్టీలు మళ్లీ ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికా రంలోకి వస్తుంటాయి.

కానీ శాసనసభ ఎన్నికలలో ఓటమి ఎదురైన తరువాత కేసీ ఆర్ మళ్లీ రావాలనే స్థాయిలో ఆ పార్టీ ప్రజా ఉద్యమాలను ఏవి నిర్మించకపోగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి క్రియాశూన్యత వలన కేసీఆర్ మళ్లీ రావాలనే నినాదానికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దొరకలేదు. కానీ, ప్రభుత్వ స్వయంకృతాపరాదాలు, గత ప్రభుత్వ పాలనని, ప్రస్తుత ప్రభుత్వ పాలనతో బేరీజు వేసుకోవటం ప్రారం భమైన తర్వాత ‘నాటి పాలకుడే నయం’ అనే అభిప్రాయం ప్రజలలో వ్యక్తవమడం మొదలైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా ఇటీవల జరిగి న రెండు పరిణామాలు మేడిగడ్డను పున రుద్ధరించాలనే ప్రభుత్వ నిర్ణయం, తెలం గాణ హైకోర్టు తీర్పుతో కేసీఆర్ పట్ల ప్రజల వైఖరి మారుతుందా! అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామపంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ ఎస్  మెరుగైన ప్రదర్శన, రెండవ శ్రేణి నాయకులు బీఆర్‌ఎస్ వైపు పయనంతో మళ్లీ ఆ పార్టీ పుంజుకుంటున్న ఛాయలు కన బడుతున్నాయి.

ముఖ్యంగా ఉత్తర తెలం గాణలోని రెండు జిల్లాలలో మళ్లీ బీఆర్ ఎస్‌కి అనుకూల రాజకీయ వాతావరణం ఏర్పడటం, జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో నిర్వహించిన సభలో ‘నూటికి నూరు శాతం మళ్లీ మనమే వస్తామ’ని నా యకుడు గట్టిగా చెప్పటంతో క్యాడర్‌లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

సగం పాలన పూర్తి చేసుకోబోతున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రతిపక్షం నిలదీయకుండా ‘ప్రజలే మాకు అధికారం కట్టబెడతార’నే అహంకారం, అ పోహలతో ఉంటే గనుక గత ఎన్నికల ఫలి తాలే పునరావృతమైనా ఆశ్చర్యపోన క్కర్లేదు. ఏదేమైనా రాబోయే రోజులలో రాష్ట్ర రాజ కీయాలలో కీలకమైన మార్పులు చోటుచేసు కోబోతున్నాయి. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో గుర్తించ లేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉం టారని లెనిన్ చెప్పిన మాటలు రాజకీ యాలలో అక్షరసత్యంగా కనిపిస్తున్నాయి.

 వ్యాసకర్త సెల్: 9885465877