మహాత్మ బసవేశ్వరుడి ఆచరణలను కొనసాగించాలి
డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
కామారెడ్డి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ మధుమోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, మహాత్మ బసవేశ్వ సమానత్వం, న్యాయం, మానవత్వానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం సమాజానికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆ విలువలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఇతర అధికారులు వీరశైవ లింగాయత్ సమాజ నాయకులతో కలిసి మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.






