10-11-2025 06:25:08 PM
రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, ఇందులో భాగంగా రైతులు సాగుచేసిన పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాలు, వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ పత్తి, వరి కొనుగోలు ప్రక్రియ రాష్ట్రంలో సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టాలని, సరిహద్దుల వద్ద అక్రమ రవాణాను అరికట్టాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, జిల్లా వ్యవసాయ, రవాణా, మార్కెటింగ్, పౌరసరఫరాలు, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కొరకు 40 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కొనుగోలు కేంద్రాలు ఎత్తైన ప్రదేశాలలో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, ప్యాడి క్లీనర్లు, ట్యాబులు, టార్పాలిన్ కవర్లు సమకూర్చడం జరిగిందని, రైతుల కొరకు త్రాగునీరు, నీడ, మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పత్తి కొనుగలు ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారి అశ్వక్ అహ్మద్, వ్యవసాయ శాఖ అధికారి వెంకటి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, రవాణా శాఖ అధికారి రామ్ చందర్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ అనంతలక్ష్మి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.