10-11-2025 07:05:22 PM
టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణ చారి
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): జర్నలిస్టుల హక్కుల సాధనకు సమిష్టిగా పోరాడుదామని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణ చారి పిలుపునిచ్చారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇటీవల టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని జిల్లాలో జర్నలిస్టుల సమస్యలు ప్రస్తావించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ప్రెస్ అకాడమి ఛైర్మెన్ నూతన అక్రిడేషన్ కార్డుల విధివిధానాలు రూపొందించి ఫైల్ మంత్రి వద్ద పెండింగ్ లో ఉందన్నారు.
ఈ నెలాఖరులోగా అక్రిడేషన్ కార్డులను ఇవ్వకపోతే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లాలో ఉద్యమాలు చెపడదామని, ఇందుకు గాను కార్యవర్గ సభ్యులు భారీ సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలన్నారు. అలాగే నూతన సభ్యత్వాలపై దృషి సారించాలని సూచించారు. కమిటీ ఆమోదం మేరకు వచ్చే నెలలో జర్నలిస్టుల కుటుంబాలకు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని వివరించారు. అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికైన జాతీయ కౌన్సిల్ సభ్యులు రంగారావు, జిల్లా ఉపాధ్యక్షుడు లోక రమణా రెడ్డిలకు పుష్ప గుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.