10-11-2025 07:01:47 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజా కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కెరటం, స్వరాష్ట్ర గేయ రచయిత డాక్టర్ అందెశ్రీ అకాల మరణం తెలంగాణ సమాజానికి, ప్రజా సాహిత్యోద్యమానికి తీరనిలోటని పీడీఎస్యు కాకతీయ యూనివర్సిీటీ ప్రధాన కార్యదర్శి వి. కావ్య, ఉపాధ్యక్షులు పి.అనూషలు తెలిపారు. సోమవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యు) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ముందు డాక్టర్ అందెశ్రీ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ అందేశ్రీ రచనలు, గేయాలు తెలంగాణ మట్టి మనుషులను వెన్నుతట్టిలేపాయని, తెలంగాణ సమాజంలో నూతన జవసత్వాలు నింపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా పనిచేశాయని గుర్తు చేశారు. జై బోలో తెలంగాణ, జన గర్జనల జడివాన, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం లాంటి గేయాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అన్నారు. ప్రజల ఐక్యతకు అడ్డంకిగా మారిన కుల, మత, ఆర్థిక అసమానతలపై తన కలంతో, గళంతో ప్రజల్ని చైతన్యవంతం చేశాడని, వారి అకాల మరణానికి పి.డి.ఎస్.యు. సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నదని వారు తెలిపారు.