రామన్ ఎఫెక్ట్ నేటికీ దిక్సూచిలా
నేడు సి.వి. రామన్ జయంతి :
నా మతం సైన్స్.. నేను సైన్స్‌నే పూజిస్తాను, ఆరాధిస్తాను.. అని పేర్కొన్నారు సి.వి. రామన్. ఎన్నో ఆవిష్కరణలకు మూలం సైన్స్.. ప్రపంచం గర్వించేలా మన భారతీయ సైన్స్ ఎదగాలని ఆయన బలంగా ఆకాంక్షించారు. చంద్రశేఖర్ వెంకట రామన్ (సి.వి.రామన్) 1888 నవంబర్ 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల రామన్ అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు.
1907లో ఎమ్మెస్సీ (ఫిజిక్స్)లో యూనివర్సిటీ విద్యను పూర్తి చేసుకున్నారు. రామన్ 18వ ఏట కాంతికి సంబంధించిన ధర్మాలపై ఆయన పరిశోధనా వ్యాసం లండన్‌కు చెందిన ఫిలసాఫికల్ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. రామన్ పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు.. ఇంగ్లండు వెళ్ళి పరిశోధన చేయాలని ప్రోత్సహించారు. కానీ ప్రభుత్వ వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లండు వాతావరణంతో సర్దుకు పోలేడని చెప్పడంతో సి.వి. రామన్ తన ఇంగ్లండు ప్రయాణం విరమించుకున్నారు.
తల్లిదండ్రుల సూచనతో ఐసీఎస్ పాసైన రామన్ కలకత్తా ప్రభుత్వ శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా విధుల్లో చేరారు. సి.వి. రామన్ తల్లి పార్వతి అమ్మాళ్‌కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీత వాయిద్యాల గురించి సాగాయి. 1921లో లండన్‌లో తాను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు.
అయితే సైన్సుపై మక్కువతో తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మళ్లించారు. ఒకరోజు కలకత్తాకు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు.. రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే దీనికి కారణమని భావించారు. తన ఊహలకు సైన్స్‌ను జోడించి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాల కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు.
అందుకు కె.ఆర్.రామనాథన్, కె.యస్ కృష్ణన్‌ల సహకారం తీసుకున్నారు. 1927లో కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు నోబెల్ బహుమతి వచ్చిన విషయం తెలుసుకున్న రామన్.. కాంప్టన్ ఫలితం ఎక్స్-రే విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాల్లో తాను అనుకున్నది నిజం కావాల్సిందే అని భావించారు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్ట్‌కు దారితీసింది. 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు.
పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వ భావాన్ని మార్చుకుంటుంది. దీనికి సంబంధించిన అంశాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించారు. రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందునా ఎందుకు పనికిరాని పరికరాలతో ఒక అద్భుతానికి నిరూపణ జరగడం గొప్ప విషయమని శాస్త్రజ్ఞులు అభినందించారు.
ఈయన పరిశోధనలకు గానూ 1930లో ఫిజిక్స్ విభాగంలో నోబెల్ బహుమతి వరించింది. ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1954లో ‘భారతరత్న’ అవార్డు బహుకరించింది. సి.వి. రామన్ జయంతి సందర్భంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుందాం.
వ్యాసకర్త: సతీశ్ రెడ్డి






