09-01-2026 12:00:00 AM
మన దేశంలో ఆడపిల్ల చరిత్ర, వర్తమానం, భవిష్యత్‌ను అక్షరాలతో వెలిగించిన జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే. ఆ జ్ఞానజ్యోతికి తోడైన మరో మహిళ ఫాతిమా షేక్. సావిత్రిబాయి ఫూలే, ఫాతిమా షేక్ 19వ శతాబ్దంలో మహారాష్ర్టలో మహిళల విద్యా వ్యాప్తికి కృషి చేసిన తొలి మహిళా గురువులు. ఆమె నిర్వహించిన విద్యా ఉద్యమంలో పాల్గొని ఆ కుటుంబానికి తోడుగా నిలిచిన దేశ తొలి ముస్లిం మహిళా టీచర్ ఫాతిమా షేక్. సావిత్రిబాయి ఫూలే తో కలిసి ఫాతిమా షేక్ దళిత, ముస్లిం బాలికల విద్యా వ్యాప్తికి కృషి చేసింది. ఫాతిమా షేక్ 1831 జనవరి 9న పుణెలో జన్మించారు. ఫాతిమా షేక్ ఆమె సోదరుడు ఉస్మాన్ షేక్ సహకారంతో విద్యనభ్యసించింది.
సావిత్రిబాయి ఫూలేతో పాటు ఫాతిమా షేక్ అహ్మద్ నగర్ లోని సింథియా ఫర్రార్ అమెరికన్ మిషనరీలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. ఫాతిమా సోదరుడు ఉస్మా న్ షేక్ ఇంట్లోనే పూలే దంపతులు 1848లో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఆ దంపతులు స్థాపించిన పాఠశాలల్లో ఫాతిమా షేక్ విద్య బోధించిం ది. అన్ని కుల, మతాల పిల్లలకు విద్యను బోధించారు. ఆ కాలంలో బాలికల కోసం పాఠశాలను నడపడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. దళితులకు, బహుజనులకు అందులోనూ బాలికలకు చదువు చెప్ప డం ఆ కాలంలో పాపంగా భావించేవారు. కేవలం కొన్ని అగ్రవర్ణాలకే చదువుకొనే హక్కు ఉండేది.
ఈ అస్పృశ్యతా అడ్డుగోడలను కూల్చినందుకు ఫాతిమా షేక్ సామా జిక శతృత్వాన్ని సైతం కొనితెచ్చుకోవాల్సి వచ్చింది. అయినా ఆమె బెదరలేదు. చదువుకు కులమతాలు, లింగబేధాలు అడ్డుకావని ఆమె నిరూపించా రు. ఉస్మాన్ షేక్ ఇంట్లో ప్రారంభమైన పాఠశాలకు విద్యార్థుల ఆదరణ పెరగటంతో మరిన్ని పాఠశాలలను చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొల్పారు. వాటి ల్లో సావిత్రీబాయి, ఫాతిమా షేక్.. ఇద్దరూ కలిసి చదువు చెప్పేవారు. అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ వాళ్లు ఆ పని చేసేవారు. సమాజం నుంచి ఎన్నో వెక్కిరింతలు, అవహేళనలు ఎదురయ్యేవి. కొందరు దుర్మార్గులు వారి పై రాళ్లు వేసేవారు. మహిళలకు చదువులెందుకు అనే ధోరణి ఆ కాలంలో ఉండేది. అందులోనూ అట్టడుగు వర్గాల ప్రజలు చదువుకోవడానికి వీలులేని దురాచారం ఉండేది. దీంతో సావిత్రి, ఫాతిమా ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. పాఠశాలకు వెళ్తుంటే వారిపై దుమ్మెత్తిపోసేవారు. పేడ నీళ్లు చల్లేవారు.
దుస్తులన్నీ తడిచిపోయి, దుర్గంధభరితమయ్యేవి. అయినప్పటికీ, భవిష్యత్ తరాల కోసం వాళ్లు ఆ అవమానాలను, దాడులను ఎం తో సహనంతో భరించారు. అమ్మాయి చదువు అవనికి వెలుగు అని చాటిచెప్పారు. ఒక అమ్మాయి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం చదువుకున్నట్ల న్న నానుడి నిజం చేసి చూపించారు. ఇంటింటికీ వెళ్లి బాలికా విద్య ప్రాము ఖ్యం గురించి చెప్పేవారు. అమ్మాయిలను స్కూలుకు పంపేలా తల్లిదండ్రులకు నచ్చజెప్పేవారు. వారిరువురూ చేసిన శ్రమ వృథా కాలేదు. ప్రజల ఆలో చనా విధానం మారింది. దళిత, బహుజన బాలికలతోపాటు, ముస్లిం అమ్మాయిలు కూడా పాఠశాలకు ఎం తో ఉత్సాహంగా వచ్చి చదువుకునేవారు. ఈ విధంగా ఫాతిమా షేక్ దేశానికి తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలయ్యారు. దళిత, బహుజన -ముస్లింల ఐక్యతకు శతాబ్దాల చరిత్ర ఉందనడానికి సావిత్రి, -ఫాతిమా స్నేహమే గొప్ప నిదర్శనం.
సంపతి రమేష్ మహారాజ్