08-08-2025 12:50:18 AM
నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తాం
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): చేనేత వస్త్రాల గౌరవం ఎప్పటికీ తగ్గేది కాదని, నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు నేత కార్మికులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఈ ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని చేనేత కార్మికులకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత పరీక్షలు చేయిస్తామని అన్నారు. ప్రతి కార్మికునికి ఆరోగ్య కార్డు అందించి సంవత్సరంలో నాలుగు సార్లు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల ఉచిత వైద్య సహాయాన్ని కూడా పొందవచ్చని తెలిపారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో చేనేత మహిళా కార్మికులు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.అనంతరం జిల్లా నుండి చేనేత పురస్కారాలు అందుకున్న పలువురు నేత కార్మికులను కలెక్టర్ సన్మానించారు. చేనేత కార్మిక సంఘాలకు రుణాల మంజూరు చెక్కులు అందజేశారు.
కలెక్టరేట్ ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శనను కలెక్టర్ సందర్శించి నేత వస్త్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు విద్యాసాగర్, పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు వాసాల రమేష్, వివిధ చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పద్మశాలి సంఘం నాయకులు, నేత కార్మికులు పాల్గొన్నారు.